TSPSC Honey Trap : హ్యాకింగ్ కాదు.. హనీట్రాప్ ? టీఎస్పీఎస్సీ పరీక్షల వాయిదాలో కొత్త కోణం ?-telangana police investigate tspsc question papers leakage few people arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Police Investigate Tspsc Question Papers Leakage Few People Arrested

TSPSC Honey Trap : హ్యాకింగ్ కాదు.. హనీట్రాప్ ? టీఎస్పీఎస్సీ పరీక్షల వాయిదాలో కొత్త కోణం ?

HT Telugu Desk HT Telugu
Mar 12, 2023 03:23 PM IST

TSPSC Honey Trap : టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీక్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్న పోలీసులు... హనీట్రాప్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ ఉద్యోగి ఓ యువతి మాయలో పడి క్వశ్చన్ పేపర్ ను లీక్ చేసినట్లు గుర్తించారని తెలుస్తోంది.

టీఎస్పీఎస్సీలో హనీట్రాప్ ?
టీఎస్పీఎస్సీలో హనీట్రాప్ ?

TSPSC Honey Trap : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో హ్యాకింక్ అంశంలో కొత్త కోణం వెలుగు చూసింది. పరీక్షలకు సంబంధించిన కీలక కంప్యూటర్ హ్యాకింగ్ కి గురైందని అనుమానించిన టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు.. ఈ అంశంపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... ఆదివారం (మార్చి 12న) జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఎగ్జామ్ తో పాటు... మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, క్లాస్ బీ పరీక్షలను నియామక బోర్డు పోస్ట్ పోన్ చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ విషయంపై విచారణ జరుపుతోన్న పోలీసులు... టీఎస్పీఎస్సీలో జరిగింది హ్యాకింగ్ కాదు హనీట్రాప్ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఓ యువతి మాయలో పడిన టీఎస్పీఎస్సీ ఉద్యోగి పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. నియామక బోర్డు సెక్రెటరీ పీఏతో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోన్న యువతి... తరచూ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వస్తుండేదని గుర్తించారు. ఈ క్రమంలోనే... ఆమె క్వశ్చన్ పేపర్ ఇవ్వాలని కోరగా... టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెక్రెటరీ పీఏతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నారు. యువతి మాయలో పడి ప్రశ్నా పత్రాలను లీక్ చేశారా ? లేక ఇందులో దళారుల ప్రమేయం ఉందా ? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. విచారణలో పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడిస్తున్నారు.

పురపాలక శాఖ పరిధిలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులు భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గతేడాది సెప్టెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే... పశుసంవర్థక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ - ఏ కింద 170 పోస్టులు... వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బీ కింద 15 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. టౌన్ ప్లానింగ్ పరీక్ష మార్చి 12న.. వీఏఎస్ పరీక్ష మార్చి 15, 16న నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే.. ప్రశ్నా పత్రాల లీక్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో... పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది.

WhatsApp channel

టాపిక్