TS EAMCET B : టీఎస్ ఎంసెట్ ఫార్మసీ కోర్సుల సీట్ల కేటాయింపు, వెబ్ సైట్ లో అలాట్మెంట్ ఆర్డర్లు
TS EAMCET B : తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ, ఇతర కోర్సుల తొలి విడత సీట్లు కేటాయింపు పూర్తైంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి, సీటు కన్ఫామ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
TS EAMCET B : తెలంగాణ ఎంసెట్ బీఫార్మసీ, ఫార్మ్ డీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి తొలి విడత సీట్లు కేటాయించారు. తొలి విడతలో 97.92 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందినట్లు అధికారులు తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్ లో మొత్తం 7 యూనివర్సిటీలు, ఒక ప్రభుత్వ కాలేజీ, 72 ప్రైవేటు కాలేజీల్లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు. బీ ఫార్మసీలో 97.52 శాతం, ఫార్మ్ డీలో 99.92 శాతం, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్, బయో టెక్నాలజీలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,362 సీట్లు ఉండగా, మొదటి విడతలో 9,168 సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు. మరో 194 సీట్లు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీట్లు పొందిన విద్యార్థులు టీఎస్ ఎంసెట్ వెబ్‌సైట్ లో అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోసుకుని, ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత సీటు కేటాయింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 14 లోపు ఫీజు చెల్లించాలి, సీట్లు పొందిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. లేని పక్షంలో సీటు రద్దవుతోందన్నారు. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే, రీఫండ్ చేసేందుకు సులభంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
తొలి విడత సీట్ల కేటాయింపు
తెలంగాణలోని ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు కీలక అప్డేట్ వచ్చేసింది. తొలి విడత సీట్లు కేటాయింపు పూర్తైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా బీఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. సెప్టెంబర్ 17న తుది విడుత కౌన్సెలింగ్ జరుగనుంది. సెప్టెంబర్ 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడుత సీట్ల కేటాయింపు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.
ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్ష రాసిన వారిలో ఇంజినీరింగ్ విభాగంలో 80.33%, అగ్రికల్చర్‌లో 86.31% మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులకు 94,614మంది దరఖాస్తు చేశారు. మరోవైపు ఇప్పటికే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తొలి విడత సీట్లు కేటాయింపు పూర్తైంది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 86,664 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా 62,079 సీట్లను భర్తీ చేయనున్నారు. గత ఏడాది కన్వీనర్ కోటాలో 71,286 సీట్లు ఉండగా.. ఈసారి 9,207 తగ్గాయి. 137 ప్రైవేటు కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్ సీట్లు, 16 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,713 సీట్లు, 2 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 1,302 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది రాష్ట్రంలో 176 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా.. ఈసారి వాటి సంఖ్య 155కి తగ్గింది.