Manthani Tragedy: ప్రాణం కన్నా ఆస్తి మిన్న... ఆస్తి కోసం మూడురోజులు శవ జాగరణ...
Manthani Tragedy: మనిషి ప్రాణం కన్నా ఆస్తిపాస్తులే మిన్న అన్నట్లు వ్యవహరించారు.. ఆస్తి కోసం చివరకు సకాలంలో అంతిమ సంస్కారం నిర్వహించకుండా అడ్డుకున్నారు. మూడు రోజులు శవజాగరణ చేశారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ అనారోగ్యంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో మృతి చెందారు. మృతునికి భార్య సంద్య మూడేళ్ళ కుమారుడు ఉన్నారు. గొడవల కారణంగా భార్యాభర్తలు ఏడాది కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో మద్యానికి బానిసైన సునీల్ మూడు రోజుల క్రితం హైదరాబాదులో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తల్లి, సోదరుడు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా భార్య పట్టించుకోలేదని. భర్త మృతి చెందాడని చెప్పినా ముందుగా స్పందించ లేదని సునీల్ బంధువులు ఆరోపిస్తున్నారు.
పోలీసులను ఆశ్రయించిన భార్య
సునీల్ మృతదేహంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బయలుదేరి సిద్దిపేట వరకు చేరుకున్నాక, అతని భార్య సంధ్య అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మృతిపై అనుమానం ఉందని అత్త తోపాటు బావపై ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సంద్య బావకు పోన్ చేసి మృతదేహాన్ని వెంటనే వెనక్కి తీసుకురావాలని ఆదేశించారు.
పోలీసుల ఆదేశంతో మృతదేహాన్ని తీసుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళగా ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతదేహం గురించి పట్టించుకోకుండా సునీల్ భార్య సంధ్య తన కొడుకుకు న్యాయం చేయాలని పట్టుబట్టింది. స్వగ్రామానికి వెళ్లాక మాట్లాడుకుందామని సర్ది చెప్పి అందరూ మంథనికి చేరారు.
రోడ్డుపై శవజాగరణ
గణేష్ నవరాత్రుల సందర్భంగా శవాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా నేరుగా మంథని సమీపంలోని గోదావరినది ఒడ్డుకు తరలించారు. నది ఒడ్డున భార్య శవ జాగరణ చేశారు. పెళ్ళి అయినప్పటి నుంచి తనను ఇబ్బంది పెట్టారని, ప్రస్తుతం ఆయన లేడని... ఇప్పుడు తన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆస్తి విషయం తేల్చే వరకు అంతిమసంస్కారం జరగనివ్వనని భీష్మించారు. తన కొడుకుకు న్యాయం జరిగే వరకు శవాన్ని కదలనివ్వనని ఆందోళనకు దిగారు. ఎవరు చెప్పినా వినకుండా అంతిమ సంస్కారం జరగకుండా అడ్డుకోవడంతో మూడు రోజులు శవ జాగరణ చేశారు.
భర్త వద్దు..ఆస్తి కావాలా?
బతికి ఉన్నప్పుడు భర్త బాగోగులను పట్టించుకోలేని భార్య, ప్రస్తుతం ఆయన చనిపోయాక ఆస్తి కోసం అంతిమ సంస్కారం జరగకుండా అడ్డుకోవడం పై బంధువులు విమర్శించారు. ఎంతమంది వచ్చి నచ్చచెప్పిన వినకుండా సంధ్య ఆస్తి కోసం పట్టుబట్టడంతో చివరకు కుటుంబ సభ్యులు కొడుకుకు న్యాయం చేస్తామని గ్రామపెద్దలు హామీ ఇచ్చారు. దీంతో సంధ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కనీసం అంతిమ సంస్కారం పూర్తయ్యే వరకు ఉండకుండా, కొడుకుతో తలకొరివి పెట్టనివ్వకుండా మృతదేహాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. ఆస్తి కోసం మూడు రోజులు హంగామా చేసిన భార్య చివరికి భర్త అంతిమ సంస్కారం పూర్తయ్యేవరకు కూడా ఉండకుండా వెళ్ళిపోవడంతో గ్రామస్తులు తీవ్రంగా విమర్శించారు. మనిషి ప్రాణం కన్నా ఆస్తే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ... ఆమె తీరును తప్పుబట్టారు.
-రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు