Congress With TJS: కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన కోదండరామ్‌-tjs president kodandaram announced support for congress party in telangana assembly elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress With Tjs: కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన కోదండరామ్‌

Congress With TJS: కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన కోదండరామ్‌

Sarath chandra.B HT Telugu
Oct 30, 2023 01:53 PM IST

Congress With TJS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మద్దతు ప్రకటించారు. టిజెఎస్‌ కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి, మాణిక్‌ రావు ఠాక్రే, ఇతర ఇన్‌ఛార్జిలు ఎన్నికల్లో మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ విజ్ఞప్తికి కోదండరామ్‌ సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి టిజెఎస్‌ మద్దతు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి టిజెఎస్‌ మద్దతు

Congress With TJS: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిజెఎస్ మద్దతు ప్రకటించింది. ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. గత పదేళ్లుగా టిఆర్‌ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలు, అప్రజాస్వామ్య చర్యల్ని నిరసిస్తూ ప్రజల పక్షాన నిఖార్సుగా పోరాడుతున్న కోదండరామ్ మద్దతును కోరడానికి టిజెఎస్‌ కార్యాలయానికి వచ్చినట్టు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణలో గడీల పాలన పోవాలి, ప్రజా పాలన రావాలని ఏకైక లక్ష్యంతో పోరాడాలని విజ్ఞప్తి చేయడంతో టిజెఎస్‌ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు.

కోదండరామ్‌ మీద నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సంపూర్ణ విశ్వాసం ఉందని, తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న తెలంగాణకు విముక్తి రావడానికి తమతో కలిసి రావాలని మాణిక్ రావు ఠాక్రేతో పాటు తెలంగాణ బాధ్యులంతా కలిసి కోదండరామ్‌ సహకారం కోరుతున్నట్లు చెప్పారు.

ఇరు పార్టీల మధ్య భవిష్యత్ కార్యాచరణ త్వరలో విడుదల చేస్తామన్నారు. ఎన్నికల సమన్వయంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా టిజెఎస్‌ను భాగస్వాముల్ని చేసి, ప్రజా సమస్యలపై చర్చించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున 2023 డిసెంబర్ 9న ఆరు గ్యారెంటీలను సంతకాలు పెట్టే సమయంలో టిజెఎస్‌ కీలక వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారని రేవంత్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్‌ తరపుణ టిజెఎస్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలు తిప్పి కొట్టాల్సిన ఉందన్నారు. 40లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్‌ను అధికారం నుంచి దింపడానికి కోదండరామ్ సహకారం కోరామని చెప్పారు. వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కలిసి పనిచేయడానికి తెలంగాణ జనసమితి అంగీకరించిందని చెప్పారు.

ఉద్యమ అకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం…

ఎన్నికల్లో మద్దతు ఇచ్చే విషయంలో తమకు ఉన్న సంశయాలు, ఆలోచనలు, కర్తవ్యాలు, అబిప్రాయాలను గురించి కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పామని కోదండరామ్ చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలన ఓడించడానికి, బిఆర్‌ఎస్‌ నిర్మించిన రాజ్యాంగ వ్యతిరేక పాలనను ఓడించడానికి కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారని, ఉద్యమ ఆకాంక్షాలను సాధించడానికి టిజెఎస్‌ సహకారం కోరారని, తెలంగాణ ఉద్యమ అకాంక్షను సాధించిన కోదండరామ్‌ అనుభవాన్ని కేసీఆర్ ను ఓడించడానికి ఉపయోగించాలన్న విజ్ఞప్తిని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

అదే సమయంలో టిజెఎస్‌ తరపున ఆరు అంశాలను ఆ పార్టీ ముందు ఉంచినట్లు చెప్పారు. తెలంగాణలో ప్రజలకు నాణ్యమైన విద్యావైద్యం అందించాలని, ఉద్యోగ ఉపాది భద్రత కల్పించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఎదుగుదల, సంప్రదాయ వృత్తిదారులకు ఆదాయ భద్రత, కౌలు, వాస్తవ సాగుదారులకు ఆదాయ భద్రత, భూముల రక్షణ, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు సంక్షేమం, ఆదాయ భద్రత, తెలంగాణ అమరులకు కుటుంబాలకు సహాయం అందించడం, ఉద్యమకారులకు సహకరించడం వంటి డిమాండ్లతో నవ తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

ఇరు పార్టీల మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, హైదరాబాద్‌తో పాటు నియోజక వర్గ స్థాయి వరకు ఐక్యత రూపొందించుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించినట్లు కోదండ రామ్ చెప్పారు. ప్రజలు కూడా దీనిని స్వాగతించాలని కోరారు. ప్రజా సంఘాలు, తెలంగాణ పౌర సమాజం తమ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని అకాంక్షించారు. కేసీఆర్‌ నిరంకుశత్వానికి చరమ గీతం పాడటానికి టిజెఎస్ కృషి చేస్తుందన్నారు.

టిజెఎస్‌ నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, సీట్ల విషయంలో అధిష్టానంతో చర్చిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సీట్లు ఓట్లు కంటే గొప్ప లక్ష్యం కోసం తాము కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. మీడియాను కూడా కేసీఆర్ నిలువునా మోసం చేశాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

వాటిపై విచారణ జరుపుతాం…

ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నందుకు ప్రణీత్‌రావు ప్రత్యేక ప్రమోషన్ ఇచ్చారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. నర్సింగ్‌రావు, ప్రభాకర్‌ రావు, ప్రణీత్‌రావు వంటి వారి సంగతి డిసెంబర్‌ 9 తర్వాత ఖచ్చితంగా తెలుస్తామన్నారు. కేసీఆర్ టెలిఫోన్ ‍హ్యాకర్లను నియమించి ఫోన్ కాల్స్‌ వింటున్నారని, అంతర్జాతీయ నేరగాళ్లను వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డిసెంబర్‌ 9 తర్వాత కేసీఆర్ ప్రైవేట్ సైన్యంపై విచారణ జరిపిస్తామని వారిని చట్టం ముందు దోషులుగా నిలుపుతామన్నారు. కోదండరామ్‌ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.

Whats_app_banner