తెలంగాణ కాంగ్రెస్‌లో టిక్కెట్ల చిచ్చు....
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త దిగులు పట్టుకుంది. కుటుంబానికి ఒక్క టిక్కెట్‌కే పరిమితం కావాలని చింతన్ శిబిర్‌లో పార్టీ అధ్యక్షురాలు నిర్ణయించడంతో టీ కాంగ్రెస్ నేతల్లో చాలామంది తమ వారసుల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికలు రాకముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ వ్యవహారం గుబులురేపుతోంది. కాంగ్రెస్ పార్టీ చింతన్‌శిబిర్‌లో ఓ కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ కేటాయించాలని తీర్మానించడంతో ఎవరికి టిక్కెట్ దక్కుతుందో, ఎవరికి గల్లంతవుతుందోననే ఆందోళన చాలామంది సీనియర్లను వేధిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమతో పాటు తమ వారసుల్ని కూడా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్న నేతలకు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మింగుడు పడటం లేదు. ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోతాయని లోలోపల ధైర్యం చెప్పుకుంటున్నా, ప్రత్యర్ధులు తమ అవకాశాలకు ఎక్కడ గండి కొడతారోనని భయపడుతున్నారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్‌లో కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ నిర్ణయం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా టీ కాంగ్రెస్‌లో ఇది కొత్త సమస్యకు దారి తీస్తోంది. తమ వారికి టిక్కెట్లు దక్కుతాయో లేదోననే ఆందోళన చాలామంది సీనియర్లకు పట్టుకుందట. తెలంగాణ కాంగ్రెస్‌లో మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి గతంలో పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ అంటే వారి ఆశల మీద నీళ్లు చల్లినట్టేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా తన ఇద్దరు కుమారుల్ని ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్నారు. జానారెడ్డితో పాటు కుమారుల్లో జయవీర్ నాగార్జున సాగర్, రఘువీర్ మిర్యాలగూడ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. జానారెడ్డి పోటీ చేయకపోతే కుమారులిద్దరికి టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇస్తారోనని మదనపడుతున్నారు.
కొండా కుటుంబంలో మురళి, సురేఖ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో సురేఖ తన కుమార్తెకు కూడా టిక్కెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. ముగ్గురిలో ఒక్కరికే టిక్కెట్ అంటే ఆ కుటుంబం ఎలా స్పందిస్తుందో తెలీదు. గ్రేటర్ హైదరాబాద్‌లో అంజన్‌కుమార్ యాదవ్ తన కుమారులు అనిల్, అరవింద్‌లను పోటీ చేయించాలని భావిస్తున్నారు. జగ్గారెడ్డి సిద్ధిపేటలో ఆయన కుమార్తె జయారెడ్డి మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యే సీతక్క కూడా తన వారసుల్ని తీసుకురావాలని యోచిస్తున్నారు.
పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఆయన కోడలు వైశాలి కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేయాలని భావిస్తే కష్టం అవుతుంది. పీసీసీ మాజీ చీఫ్ ఉతమ్ కుమార్ భార్య పద్మావతి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐదేళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న వారికి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉండటంపైనే కాంగ్రెస్ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా టీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గానే ఉన్నారు. జానారెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం లాభిస్తుందని భావిస్తున్నారు. మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగ్గారెడ్డి భార్య పోటీ చేశారు. కోమటిరెడ్డి సతీమణ కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో తమకు మినహాయింపు ఉంటుందని భావిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
సంబంధిత కథనం
టాపిక్