Medak SHG Issue: మహిళా సంఘం డబ్బులు సొంతగా వాడుకున్నవ్యక్తిని చెట్టుకు కట్టేసిన మహిళలు-the women who tied the man to the tree who used the money of the shg ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Shg Issue: మహిళా సంఘం డబ్బులు సొంతగా వాడుకున్నవ్యక్తిని చెట్టుకు కట్టేసిన మహిళలు

Medak SHG Issue: మహిళా సంఘం డబ్బులు సొంతగా వాడుకున్నవ్యక్తిని చెట్టుకు కట్టేసిన మహిళలు

HT Telugu Desk HT Telugu
Sep 13, 2024 11:50 AM IST

Medak SHG Issue: మహిళా సంఘం లోన్ డబ్బులను బ్యాంకులో కట్టకుండా సొంత ఖర్చులకు వాడుకున్న గ్రూప్ నాయకురాలి భర్తను గ్రూప్ సభ్యులు స్థంబానికి తాడుతో కట్టేసిన సంఘటన మెదక్ జిల్లాలో కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఓ వ్యక్తి వాటిని సొంతానికి వాడేసుకున్నాడు.

రుణాల కిస్తీ కాజేసిన బిక్షపతిని చెట్టుకు కట్టేసిన మహిళలు
రుణాల కిస్తీ కాజేసిన బిక్షపతిని చెట్టుకు కట్టేసిన మహిళలు

Medak SHG Issue: మెదక్‌లో స్వయంసహాయక బృందం తరపున బ్యాంకు చెల్లించాల్సిన రుణమొత్తాన్ని సొంతానికి వాడుకున్న వ్యక్తిని మహిళలు చెట్టుకు కట్టేశారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి పడాలపల్లికి చెందిన అంబేడ్కర్ మహిళా సంఘం సభ్యులు రెండేళ్ల కిందట తూప్రాన్ ఎస్బీఐ బ్యాంకులో రూ. 10 లక్షల లోన్ తీసుకున్నారు.

ఈ గ్రూపులో మిన్నిమోల్, సిద్దమ్మ అనే ఇద్దరు గ్రూప్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా వీరిద్దరూ ప్రతి నెల గ్రూప్ సభ్యుల నుండి పొదుపు, వడ్డీ డబ్బులు వసూలు చేసి బ్యాంక్ లో చెల్లిస్తున్నారు.

ఈ క్రమంలో కొంతకాలంగా మిన్నిమోల్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో, తన భర్త బిక్షపతి ప్రతి నెల డబ్బులు వసూలు చేసి కడతాడని గ్రూప్ సభ్యులకు తెలిపింది. కాగా బిక్షపతి 11 నెలల నుండి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టకుండా తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. డబ్బు బ్యాంకులో కట్టి వచ్చిన తర్వాత వడ్డీ వివరాలు ఇవ్వాలని భార్య మిన్నిమోల్ ఐదారు నెలలుగా అడుగుతున్న భర్త దాటేస్తూ వస్తున్నాడు.

ఇటీవల ఆమె గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టాడు. దీంతో భార్య షాక్ తిన్నారు. ఈ 11 నెలలు లోన్ డబ్బులు కట్టకుండా రూ. 6 లక్షలకు పైగా తన సొంత ఖర్చులకు వాడుకున్నట్లు తెలిపాడు.

6 లక్షలు వాడేసుకున్నాడు…

ఈ విషయం తెలిసిన గ్రూప్ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సెప్టెంబర్ 10 వ తారీఖు వరకు డబ్బులు చెల్లించాలి. లేనియెడల తమ ఇంటిని జప్తు చేస్తామని గ్రామ పెద్దలు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. బిక్షపతి దంపతులు గడువు లోపల డబ్బులు చెల్లించలేదు. గ్రామ పెద్దలు వారికీ పెట్టిన గడువు ముగియడంతో మంగళవారం రాత్రి గ్రూప్ సభ్యులు వారి ఇంటికి వచ్చి నిలదీశారు. దీంతో వారిద్దరి మద్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది.

భార్య పై దాడికి పాల్పడిన నిందితుడు..

ఈ ఘర్షణలో బిక్షపతి భార్య మున్ని పై దాడికి యత్నించగా సంఘం సభ్యులు అడ్డుకొని అతనిని గ్రామంలోని విద్యుత్ స్థంబానికి తాడుతో కట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు కలుగజేసుకొని విడిపించి ఉదయం మాట్లాడదామని చెప్పి ఇంటికి పంపించారు.

డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలి.…

బుధవారం ఉదయం గ్రూప్ సభ్యులందరూ కలిసి బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి మాట్లాడగా .. రూ. 6. 68 లక్షలు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. దీంతో వారు బ్యాంకు మేనేజర్ కు పిర్యాదు చేయడంతో పాటు, తమకు న్యాయం చేయాలనీ కోరుతూ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు.

తనను గ్రూప్ సభ్యులు చెట్టుకు కట్టేశారని బిక్షపతి పోలీసులకు పిర్యాదు చేశాడు. బ్యాంకు రుణాల వడ్డీ చెల్లింపు డబ్బులు కాజేశాడని మహిళా గ్రూప్ సభ్యులు బిక్షపతిపై పిర్యాదు చేశారు. ఇరువురి పరస్పర ఫిర్యాదుల మేరకు బుధవారం బిక్షపతిపై, గ్రూప్ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.