Fathers Murder: తండ్రిని చంపేసిన ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి మర్డర్
Fathers Murder: కన్న తండ్రిని చంపి సాధారణ మరణంగా అందరిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసిన పిల్లల నిర్వాకం ఏడాదిన్నర తర్వాత వెలుగు చూసింది.
Fathers Murder: కన్న తండ్రిని చంపి, అది సాధారణ మరణమేనంటూ కొడుకు, కూతురు, అల్లుడే అంత్యక్రియలు జరిపించిన సంచలన సంఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలోని అనంత సాగర్ గ్రామంలో జరిగింది.
2022, జులై 16 జరిగిన ఈ సంఘటన, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హంతకుల ప్రవర్తన తీరులో మార్పుని చూసి.. వారి తల్లి చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, చేగుంట పోలీసులు గాంధీ హాస్పిటల్ నుండి డాక్టర్లను రప్పించి, 18 నెలల కింద పాతిపెట్టిన శవాన్ని బయటకి తీసి పోస్టమార్టమ్ జరిపి అదే హత్యేనని తేల్చారు. హంతకులైన కొడుకు, కూతురు కటకటాల పాలయ్యారు.
ప్రతిరోజు తిడుతున్నాడని....
అనంత సాగర్ గ్రామానికి చెందిన కావేటి కిష్టయ్య (61), కావేటి లక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. కొడుకు స్వామి, కూతురు రేణుక, చిన్న కూతురు సత్తవ్వలకు పెళ్లిళ్లు కూడా జరిపించారు.
కొంతకాలంగా పెద్ద కూతురు రేణుక, తన భర్త అశోక్ తో కలిసి, అత్తగారింటి దగ్గరే నివాసం ఉంటున్నారు. 2022, జులై 16న లక్ష్మి తన చిన్న కూతురైన సత్తవ్వని చూడటానికాని తన గ్రామానికి వెళ్ళింది.
చిన్న విషయంలో కిష్టయ్య తన కుమారుడు స్వామి, అల్లుడు అశోకుని తిట్టడంతో, వారు తీవ్ర మనస్తాపాని గురయ్యారు. తనని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని, తమను ప్రతి చిన్న విషయానికి తిడుతున్నాడని నిర్ణయానికి వచ్చారు. రాత్రి పడుకున్న తర్వాత.. అశోక్, రేణుక దంపతులు ఇద్దరు కిష్టయ్య కాళ్ళు చేతులు గట్టిగ పట్టుకోగా, కొడుకు స్వామి గొంతు నులిమి, తల కింద పెట్టుకున్న దిండుతో ముఖంపై అదిమి చంపేశారు.
నాన్న నిద్రలోనే చనిపోయాడు...
తెల్లవారుజామున, ఏమి తెలియనట్టుగా, తల్లికి ఫోన్ చేసి నాన్న నిద్రలోనే మరణించాడని సమాచారమిచ్చారు. అయితే, తనకు తన భర్త మరణం పైన అనుమానం ఉన్నదని లక్ష్మి అనుమానం వ్యక్తం చేసినా కొడుకు, కూతురు ఇద్దరు తనకు నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించారు.
ఆ తర్వాత అల్లుడు అశోక్ అనారోగ్యంతో మరణించాడు. కొడుకు, కూతురు ప్రవర్తనలో మార్పు చూసిన లక్ష్మి, చివరికి తన చిన్న కూతురు మిగతా బంధువుల సహకారంతో చేగుంట పోలీసులకు ఫిర్యాది చేసింది.
గ్రామస్థుల సహకారంతో, పోలీసులు శవాన్ని బయటకి తీసి పోస్టమార్టమ్ చేసి పూడ్చిపెట్టారు. పోస్టమార్టమ్ రిపోర్ట్‌లో, కిష్టయ్యది హత్యేనని డాక్టర్లు తేల్చడంతో, చేగుంట పోలీసులు స్వామి, రేణుకను అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు.
కోర్టు వారిని జ్యూడిసియల్ రిమాండుకు తరలించమని ఆదేశించింది. ఈ సంఘటన మెదక్ జిల్లాలోలో సంచలనం సృష్టించింది. కేసుని అతి వేగంగా ఛేదించిన, తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, ఇన్స్పెక్టర్ లక్ష్మి బాబు, ఎస్సై హరీష్ సిబ్బందిని ఎస్పీ బి బాల స్వామి అభినందించారు.