Raj Bhavan Vs Pragati Bhavan: సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడంతోనే వెళ్లలేదన్న గవర్నర్
Raj Bhavan Vs Pragati Bhavan: తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందకపోవడం వల్లే ఆ కార్యక్రమానికి గవర్నర్ తమిళ సై వెళ్లలేదని రాజ్ భవన్ స్పష్టం చేసింది.
Raj Bhavan Vs Pragati Bhavan: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించినా ఉద్దేశపూర్వకంగానే ఆమె హాజరు కాలేదని తెలంగాణ మంత్రులు ఆరోపించిన నేపథ్యంలో రాజ్ భవన్ స్పందించింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా గవర్నర్ తమిళసైకు ఎలాంటి ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్ స్పష్టం చేసింది.
సచివాలయ ప్రారంభానికి ఆహ్వానం లేకపోవడం వల్లే వెళ్ళలేదని గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత నెల 30వ తేదీన తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. తెలంగాణ గవర్నర్‌కు కూడా ఆహ్వానం పంపినా ఉద్దేశ పూర్వకంగా ఆమె హాజరు కాలేదని పలువురు మంత్రులు ఆరోపించారు.
ఇప్పటికే తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌గా వివాదాలు నడుస్తున్నాయి. ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిపై పలుమార్లు గవర్నర్ నేరుగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ కావాలని గైర్హాజరయ్యారనే ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈ మేరకు వివరణ ఇస్తూ రాజ్‌భవన్ పత్రిక ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రోటోకాల్ విషయంలో గతంలో కూడా ఇలాంటి వివాదాలు తలెత్తాయి. ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలుమార్లు విమర్శలు గుప్పించడంతో గవర్నర్‌కు నిజంగానే ఆహ్వానం అందినా రాలేదని ప్రచారం జరిగింది. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో రాజ్‌భవన్ స్పందించి, గవర్నర్‌ను ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు నిరాధారమని, ఎలాంటి ఆహ్వానం రాలేదని స్పష్టం చేసింది. గవర్నర్ కార్యాలయానికి ఎలాంటి ఆహ్వాన పత్రం అందలేదని రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి.
మరోవైపై సచివాలయ ప్రారంభానికి రాకపోవడాన్ని మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గవర్నర్‌ను నియమించిన పార్టీ వైఖరికి అద్దం పడుతూ అక్కసు ప్రదర్శించారని ఆరోపించారు. ఈర్ష్యతోనే సచివాలయ ప్రారంభానికి హాజరు కాలదేని మంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడలేక, తెలంగాణ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేక ఇలా చేశారని మండిపడ్డారు. దీంతో రాజ్‌భవన్ ఇన్విటేషన్ విషయంలో క్లారిటీ ఇచ్చింది.