TGSRTC: బస్సులో బంగారం మర్చిపోయిన మహిళ.. నిజాయితీ చాటుకున్న కండక్టర్
TGSRTC: ఉరుకుల పరుగుల జీవితంలో అంతా హడావుడే. ప్రయాణాలు చేసేటప్పుడు కంగారుగా ఎక్కి, దిగి పోతుంటారు. ఆ సమయంలో విలువైన వస్తువులను మర్చిపోతుంటారు. అలా పోయిన వస్తువు దొరకడం కష్టమే. కానీ పోయిన వస్తువు తిరిగి దొరికితే ఆ సంతోషం మాటల్లో చెప్పలేరు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో జరిగింది.
విధి నిర్వహణలో ఓ మహిళా కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ రెండున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న పర్సు మర్చిపోయింది. దానిని గమనించిన సిద్దిపేట జిల్లా దుబ్బాక డిపోకు చెందిన కండక్టర్ దేవమ్మ.. పర్సును ఆ మహిళకు అప్పగించి.. తన నిజాయితీని చాటుకున్నారు.
మూడున్నర తులాల బంగారం..
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మోజిపేటకు చెందిన సంగం రాజమణి.. దుబ్బాక డిపోకు చెందిన బస్సులో దుబ్బాక నుంచి బీబీపేటకు ప్రయాణించింది. ఆ ప్రయాణంలో బస్సులో తన పర్సును మర్చిపోయి దిగిపోయింది. ఆమె దిగిన తర్వాత.. సీట్లో పర్సును కండక్టర్ దేవమ్మ గమనించింది. వెంటనే పర్సును తెరిచి చూడగా అందులో మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, మూడు వేల రూపాయల నగదు ఉన్నట్లు ఆమె గుర్తించారు.
దేవమ్మ ఆ పర్సును దుబ్బాక డిపో మేనేజర్ సురేందర్‌కు అప్పగించారు. డిపో అధికారులు ప్రయాణికురాలు రాజమణిని పిలిపించి.. పోగొట్టుకున్న పర్సును అప్పగించారు. ఈ బంగారు ఆభరణాల విలువ రూ. 2. 50 లక్షలు ఉంటుందని చెప్పారు. తన బంగారాన్ని తిరిగి ఇచ్చినందుకు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. కండక్టర్ దేవమ్మ నిజాయితీని ప్రశంసించి.. ప్రయాణికురాలు రాజమణి ఆమెను సన్మానించారు.
మొబైల్‌ని అప్పగించిన పోలీసులు..
సంగారెడ్డి జిల్లాలో నైట్ బీట్ డ్యూటీ నిర్వహిస్తున్నహోంగార్డ్ మహేందర్, లక్ష్మణ్‌లకు సంగారెడ్డి చౌరస్తాలో రూ.70 వేల విలువైన ఐఫోన్ కనిపించింది. ఆ ఫోన్‌ను తీసుకొచ్చి సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆ ఫోన్ సదాశివపేట మండలం ఆరూర్ గ్రామానికి చెందిన మనోజ్ కుమార్‌ది అని పోలీసులు గుర్తించారు. అతనికి సమాచారం ఇచ్చి.. శనివారం ఉదయం ఠాణాకు రమ్మన్నారు. అతను హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ఫోన్ పోయిందని మనోజ్ తెలిపారు.