Gold Robbery Case : ట్రావెల్స్ బస్సులో 3 కేజీల బంగారు ఆభరణాలు చోరీ, కేసును ఛేదించిన పోలీసులు
Gold Robbery Case : జహీరాబాద్ లోని ఓ దాబా వద్ద ఆరెంజ్ ట్రావెల్ బస్సులో 3 కేజీలో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది కంజర ముఠాగా గుర్తించారు. నిందితుల్లో ఒకడు పట్టుబడగా, మరో ముగ్గురు పరారయ్యారు. నిందితుల నుంచి 3 కేజీల బంగారం ఆభరణాల రికవరీ చేశారు.
Gold Robbery Case : వారం రోజుల క్రితం జహీరాబాద్ మండలం సత్వార్ కోహినూర్ దాబా వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో బంగారు ఆభరణాలు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 3 కేజీల బంగారు ఆభరణాలు, బ్రీజా కారు స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. జహీరాబాద్ సబ్ డివిజన్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రూపేష్ వివరాలు వెల్లడించారు.
జులై 26న బస్సులో బంగారం చోరీ చేసిన నిందితులను పట్టుకునేందుకు జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా సోమవారం జాతీయ రహదారిపై బూర్ధిపాడ్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కాగా ఒక మారుతి బ్రీజా కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారిపై అనుమానం వచ్చిన పోలీసులు కారును ఆపి వారిని విచారించే సమయంలో పారిపోవడానికి ప్రయత్నించారు. అందులో ఒక వ్యక్తి పట్టుబడగా, ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. నిందితులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా దార్వార్ పురా కీర్వా జాగీర్ ప్రాంతానికి చెందిన "కంజర ముఠాగా" గుర్తించారు. పట్టుబడిన నిందితుడు ముస్తాక్ ఖాన్ అలియాస్ మాసూమ్ (40) ను విచారించగా తామే బంగారం చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ. 3.10 కోట్ల విలువ గల 3 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని హైదరాబాద్ లో అమ్ముకోవాలనే నిందితులు వచ్చినట్లు తేలింది. పారిపోయిన అష్రాఫ్,ఫెరోజ్, సాజిద్ నిందితుల త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
బంగారు ఆభరణాల వ్యాపారులే లక్ష్యంగా
నలుగురు సభ్యులున్న ఈ ముఠా దేశవ్యాప్తంగా హోటల్స్ వద్ద ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా బంగారు ఆభరణాల వ్యాపారులే లక్ష్యంగా చేసి వారి రాకపోకలపై రెక్కీ నిర్వహించి చోరీ చేస్తారు. దాబాల వద్ద బస్సులు ఆగగానే ప్రయాణికుల్లా లోపలికి వెళ్లి ఆభరణాల బ్యాగ్ లు దొంగిలిస్తారని విచారణలో తేలింది. పది రోజుల వ్యవధిలో కేసు ఛేదించిన డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐలు శివలింగం, మల్లేశంను అభినందించి రివార్డులు అందజేశారు. పరారైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.
ముంబయికి చెందిన నగల వ్యాపారి విశాల్ జైన్ కు చెందిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు అతడి బంధువు ఆశిష్ జైన్ 5 కేజీల బంగారు ఆభరణాలతో హైదరాబాద్ కు వచ్చి 2.100 కిలోల బంగారు ఆభరణాలు విక్రయించాడు. మిగిలిన 3 కేజీల బంగారు ఆభరణాలతో జులై 26 న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ముంబయికి పయనమయ్యాడు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్వార్ కోహినూర్ ఢాబా వద్ద ఆశిష్ భోజనం కోసం కిందికి దిగాడు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆ బస్సు లోని బంగారు ఆభరణాల బ్యాగ్ ను దొంగిలించారు. ఆ తర్వాత బస్సులోకి వెళ్లి చూసేసరికి బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.