Telugu Language Day: అమ్మ భాషపై మమకారం.. 38 ఏళ్లుగా తెలుగులోనే సంతకం!-telugu language day special story on a teacher who has been signing in telugu for 38 years ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telugu Language Day: అమ్మ భాషపై మమకారం.. 38 ఏళ్లుగా తెలుగులోనే సంతకం!

Telugu Language Day: అమ్మ భాషపై మమకారం.. 38 ఏళ్లుగా తెలుగులోనే సంతకం!

Basani Shiva Kumar HT Telugu
Aug 29, 2024 01:41 PM IST

Telugu Language Day: అమ్మ జ‌న్మ‌నిస్తే.. మాతృ భాష తెలుగు.. జీవితాల‌కు వెలుగునిస్తోంది. అందుకే అమ్మ భాషపై చాలామంది మక్కువతో ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మొదలు.. అనేక మంది ప్రముఖులు తెలుగు భాషపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారు.

తెలుగులో వేంకట కృష్ణారావు సంతకం
తెలుగులో వేంకట కృష్ణారావు సంతకం

అమ్మ జన్మనిస్తే.. తెలుగు తన జీవితానికి వెలుగునిచ్చిందని చెబుతున్నారు ఓ ఉపాధ్యాయుడు. అందుకే అమ్మ భాషపై మక్కువతో.. 38 ఏళ్లుగా తెలుగులోనే సంతకం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి.. రిటైర్ అయ్యే వరకు తెలుగులోనే సంతకం చేసి.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా.. ఆ ఉపాధ్యాయుడిపై ప్రత్యేక కథనం.

1986 నుంచి..

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మెడతాటి వేంకట కృష్ణారావుకు 1986లో ఉద్యోగం వచ్చింది. 2024లో వేంకట కృష్ణారావు రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగంలో చేరిన నాటి నుంచి.. రిటైర్ అయ్యే వరకు తెలుగులోనే సంతకం చేశారు. వేంకట కృష్ణారావు పలు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆయన పాఠాలు వినడం ఎంతో అదృష్టమని వేంకట కృష్ణారావు పూర్వ విద్యార్థులు చెబుతున్నారు.

అమ్మ భాషపై విద్యార్థులకు ఆసక్తి పెంచేలా..

వేంకట కృష్ణారావు కేవలం ఉద్యోగం చేసి ఊరుకునేవారు కాదు. విద్యార్థులకు తెలుగు భాషపై పట్టు పెంచేందుకు కూడా కృషి చేశారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి.. బహుమతులు అందజేస్తూ.. ప్రోత్సహించేవారు. ఇందు కోసం తన సొంత డబ్బును ఖర్చు చేశారు. అంతేకాదు.. ఎవరైనా తెలుగుకు సంబంధించిన పుస్తకాలు కావాలంటే.. సమకూర్చేవారు.

ఆయన పాఠాలు.. అమ్మచేతి గోరుముద్దలు..

తెలుగు పాఠాలు బోధించడంలోనూ వేంకట కృష్ణారావు శైలి వేరుగా ఉండేది. మూస పద్ధతిలో కాకుండా విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించేవారు. మధ్యమధ్యలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. విద్యార్థులను నవ్విస్తూ పాఠాలు చెప్పేవారు. మహాభారతం గురించి ఆయన చెబుతుంటే విన్నవారు.. జీవితంలో మర్చిపోలేమని వేంకట కృష్ణారావు పూర్వ విద్యార్థులు చెబుతున్నారు.

వేంకట కృష్ణారావు స్పూర్తితో..

వేంకట కృష్ణారావు స్పూర్తితో చాలామంది తెలుగు ఉపాధ్యాయులు అయ్యారు. ముఖ్యంగా ఆయన పూర్వ విద్యార్థులు ఎంతో మంది ఇప్పుడు తెలుగు బోధిస్తున్నారు. వేంకట కృష్ణారావు మాస్టారును స్పూర్తిగా తీసుకొనే తాము తెలుగు ఉపాధ్యాయులం అయ్యామని చెబుతున్నారు. తాము కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని అంటున్నారు.