RTA Server Down : తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్, నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు!-telangana rta server down new vehicle registration stalled ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Rta Server Down New Vehicle Registration Stalled

RTA Server Down : తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్, నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు!

Bandaru Satyaprasad HT Telugu
May 31, 2023 05:15 PM IST

RTA Server Down : తెలంగాణ నూతన వాహనాల రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీఏ సర్వర్ డౌన్ తో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

తెలంగాణ ఆర్టీఏ సర్వర్లు డౌన్
తెలంగాణ ఆర్టీఏ సర్వర్లు డౌన్ (HT )

RTA Server Down : తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆర్టీఏ సర్వర్ డౌన్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . తమ వాహనాలు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతాయోనని ఆర్టీఏ ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. రవాణా శాఖ సర్వర్‌ డౌన్‌ కావడంతో కార్యకలాపాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో వాహనదారుల వివరాలు కనిపించడం లేదు. స్లాట్ బుక్‌ చేసి వాహనాల రిజస్ట్రేషన్ కోసం వాహనదారులు ఎదురుచూస్తున్నారు. సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఏపీలోనూ రెండ్రోజులుగా సర్వర్ డౌన్‌తో భూములు రిజిస్ట్రేషన్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

రిజిస్ట్రేషన్ లో కొత్త నిబంధనలు

వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో బీఎస్ -6(BS 6) ఉద్గార ప్రమాణాలను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్- 6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే కేంద్రం వెల్లడించింది. వాహన తయారీ కంపెనీలు బీఎస్ 6 ప్రమాణాలతోనే ఇంజిన్లను తయారు చేయాలని సూచించింది. బీఎస్ 4 వాహనాల వినియోగంతో కార్బన్‌ డై ఆక్సైడ్ పెరుగుతుండడం, అది వాతావరణంలో కలిసిపోయి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ ఉద్గార ప్రమాణాలను కేంద్రం అమలుచేస్తుంది. 2020లో బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తిగా నిలిపివేశారు. కేవలం బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలను మాత్రమే అనుమతించారు. ఈ నిబంధనలను దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణే, సూరత్, కాన్పూర్, షోలాపూర్, జంషెడ్ పూర్, ఆగ్రాలో అమలుచేస్తున్నారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసే వాహనాల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ పరిధిలోనే జరుగుతున్నాయి.

రెండేళ్లుగా బీఎస్ 6 వాహనాల విక్రయం

బీఎస్ అంటే భారత్ స్టాండర్డ్‌ అని అర్థం. వాహనం నుంచి వెలువడే ఉద్గారాలను బట్టి వీటి స్థాయిని నిర్ణయిస్తారు. 2005లో మార్కెట్‌లోకి వచ్చిన బీఎస్-3 వాహనాలు 2010 నాటికి బాగా పెరిగాయి. 2017లో బీఎస్-4 వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. వాహన కాలుష్యం తగ్గించేందుకు ప్రస్తుతం బీఎస్-6 వాహనాలకు అనుమతివ్వాలని కేంద్ర, రాష్ట్రాలు నిర్ణయించాయి. గత రెండేళ్లుగా బీఎస్-6 వాహనాల విక్రయాలు పెరిగాయి. బీఎస్ 6 వాహనాల వేగం, సామర్థ్యం మెరుగ్గా ఉండడంతో పాటు కాలుష్య శాతాన్ని తగిస్తున్నాయి. ఈ వాహనాలు మైలేజీ పరంగా 15 శాతం అధికంగా వస్తాయని రవాణాశాఖ అధికారులు అంటున్నారు.

IPL_Entry_Point