Telangana Covid Cases : మరో 12 మందికి కొవిడ్ - తెలంగాణలో 38కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య
Covid Cases in Telangana Updates : తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం కొత్తగా 12 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైదారోగ్యశాఖ తెలిపింది.
Covid Cases in Telangana : తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో శనివారం 1,322 మందికి పరీక్షలు నిర్వహించగా… 12 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 38కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 99.51శాతంగా ఉందని, మరణాల రేటు 0.49శాతం ఉన్నట్లు తెలిపింది.
డిసెంబర్ 23వ తేదీ నాటి కొవిడ్ రిపోర్ట్ - వైదారోగ్యశాఖ :
తెలంగాణలో కొత్త కొవిడ్ కేసులు - 12
కోలుకున్న వారి సంఖ్య - 1
మరణాల రేటు - 0.49శాతం
రికరవరీ రేటు - 99.51శాతం.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య - 38
శనివారం నిర్వహించిన పరీక్షల సంఖ్య - 1,322
మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
మంత్రి దామోదర సమీక్ష
కొవిడ్ నియంత్రణపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో వివిధ ఆస్పత్రులలో ఉన్న వెంటిలేటర్ల పనితీరును పరిశీలించాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పని చేయని పీఎస్‌ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరిగ్గా వినియోగించాలని… అన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గాంధీ హాస్పిటల్‌లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలని… కోవిడ్ రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ సంస్థల నుంచి గత నాలుగేళ్లుగా అందిన సీఎస్‌ఆర్ విరాళాల జాబితాపై నివేదిక అందజేయాలని పేర్కొన్నారు.