TDP BJP Alliance : తెలంగాణలో మారుతున్న రాజకీయాలు- టీడీపీ, బీజేపీ దోస్తీ కుదిరినట్టేనా?
TDP BJP Alliance : చంద్రబాబు దిల్లీ పర్యటన తర్వాత తెలంగాణలో పొత్తుల టాక్ నడుస్తోంది. టీడీపీ, బీజేపీ వరుసగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తుండడంతో... తెలంగాణ రాజకీయాలు మారబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
TDP BJP Alliance In Telangana : టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్ షాతో భేటీ తర్వాత తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో కలిసి పనిచేయాలని టీడీపీ, బీజేపీ నిర్ణయించుకున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీ, బీజేపీ నేతలు విస్తృతస్థాయి సమావేశాలతో బిజీబిజీ అయ్యాయి. చంద్రబాబు దిల్లీ పర్యటన తర్వాత తెలంగాణలో ఎక్కువ చర్చ జరిగింది. తెలంగాణలో ఎన్నికలు తగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా పొత్తులపై దృష్టిపెట్టాయి. బీజేపీ, టీడీపీ అంతర్గత చర్చలను ప్రారంభించడంతో, దిల్లీలో చంద్రబాబు పర్యటనకు తెలంగాణ రాజకీయాలకు ఏమైనా లింక్ ఉందా? అనే విశ్లేషణలు మొదలయ్యాయి. తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుందని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు, బీజేపీ పెద్దలతో మీటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం- చంద్రబాబు
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ తెలంగాణ టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏదో ఒకరోజు తప్పకుండా టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం వస్తుందన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల ఉత్సాహంగా పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తోందంటే అందుకు టీడీపీనే కారణం అన్నారు. తెలుగు వాళ్లు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నారంటే అది టీడీపీ ఘనతే అన్నారు చంద్రబాబు. ఆనాడు ఐటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా టీడీపీ పాత్ర ఉందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో సహా కీలక నేతల చంద్రబాబు పలు కీలక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రావడం, ఆ తర్వాత తెలంగాణలో పొత్తులపై చర్చలు జరుగుతుండటంతో పొత్తులపై బీజేపీ హైకమాండ్ పెట్టిన ప్రతిపాదనల్ని చంద్రబాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది.
బీజేపీ అంతర్గత సమావేశాలు
తెలంగాణ బీజేపీ నేతలు కూడా వరుసగా పార్టీ శ్రేణులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతున్నారు. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా, సునీల్ బన్సల్ తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉండడంతో... అన్ని వర్గాల వారితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరపునున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా ఎన్నికల సన్నాహాలు, టీడీపీతో పొత్తులపై అభిప్రాయాలు తెలుసుకోవడంపై బీజేపీ దృష్టిపెట్టినట్లు సమాచారం. అయితే టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని బండి సంజయ్ అంటున్నారు.
పొత్తుల దిశగా
తెలంగాణలో టీడీపీకి సైలెంట్ ఓటింగ్ ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యనేతలంతా పార్టీని వీడడంతో టీడీపీ కోర్ ఓటర్లు ఆయా పార్టీలకు మళ్లారని, అయితే సమర్థమైన నేతలుంటే తెలంగాణ పార్టీకి పునర్వైభవం వస్తుందని చంద్రబాబు అంటున్నారు. అందుకోసం తగిన ప్రణాళికలు చేస్తున్నారు. ఇటీవల దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన చంద్రబాబు... తెలంగాణలో పొత్తులపై మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.