మోదీకి తెలంగాణపై అక్కసు.. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేది అన్యాయం: మంత్రి హరీష్-telangana minister harish rao fires on pm modi over his state bifurcation comments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Minister Harish Rao Fires On Pm Modi Over His State Bifurcation Comments

మోదీకి తెలంగాణపై అక్కసు.. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేది అన్యాయం: మంత్రి హరీష్

HT Telugu Desk HT Telugu
Feb 08, 2022 04:49 PM IST

Harish Rao| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. మోదీ రాజ్యసభలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై ఎందుకంత కక్ష, ఎందుకు వివక్ష, విభజన హామీలేమయ్యాయని ప్రశ్నించారు.

తెలంగాణ మంత్రి హరీష్ రావు
తెలంగాణ మంత్రి హరీష్ రావు (FB)

Hyderabad | ఆంధ్రప్రదేశ్ విభజన తీరు సరిగ్గా లేదంటూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రధాని మోదీపై, బీజేపీపై నిప్పులు చెరిగారు. హరీష్ రావు మాట్లాడుతూ .. 'తెలంగాణ వచ్చిందని ఇక్కడి ప్రజలు సంతోషపడితే ప్రధాని మోదీ ఎందుకో బాధపడుతున్నాడు. తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా మోదీ తన అక్కసు వెళ్లగక్కుతాడు. విద్వేషం చిమ్ముతాడు. ఆంధ్ర- తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట. తెలంగాణ మీద అంత కక్ష ఎందుకు' అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు.

సీఎం కేసీఆర్ ఏ సంక్షేమ కార్యక్రమం ప్రారంభించినా అవి దేశానికే దిక్సూచిగా నిలబడ్డాయి. పింఛన్లు పెంచాము, ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాము, రైతు బంధు, రైతు బీమా, దళిత బందు ఇలా అనేక పథకాలు ఇచ్చుకుంటున్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాకపోతే ఇంతటి అభివృద్ధి సాధ్యమయ్యేదా? తెలంగాణ ప్రజలు వేరుపడ్డారు..బాగుపడ్డారు. ఈ రాష్ట్రం బాగుపడుతుంది అంటే అది మోదీకి నచ్చడం లేదు అభివృద్ధిలో గుజరాత్‌ను దాటిపోతున్నామని మోదీకి భయమా? అని హరీష్ రావు నిలదీశారు.

1999లో కాకినాడ తీర్మానం చేసి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారు. అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వకుండా దగా చేసింది. మరి అప్పుడు సుఖ ప్రసవం చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంది ఎవరు? ఎందుకు మాట ఇచ్చి తప్పారు? అని హరీష్ ప్రశ్నించారు.

సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా విభజన చేశారు అని ప్రధాని మోదీ అన్నారు. మరి ఏ సమాఖ్య స్ఫూర్తితో నాడు ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాలో కలిపారు. కనీసం తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేయకముందే రాత్రికిరాత్రే కలిపేశారు. మరి అప్పుడేమైంది మీ సమాఖ్య స్ఫూర్తి అంటూ హరీష్ రావు నిలదీశారు.

తెలంగాణ ఏర్పడితే మీకు వచ్చిన బాధ ఏమిటి? పెప్పర్ స్ప్రే మధ్య బిల్లు పాస్ అయిందట. ఎట్లా పాస్ అయితే ఏంటి. మీరు అధికారంలో ఉన్న ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే అంత మంది బలిదానాలు జరిగేవా.. శ్రీకాంత చారి అమరుడు అయ్యేవాడా..? వందల మంది తెలంగాణ యువకులు చనిపోవడానికి కారణం కాంగ్రెస్, బీజేపీలు కాదా అంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు.

అవకాశం చిక్కినప్పుడల్లా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లు మాట్లాడుతున్నారు, ఇది దురదృష్టకరమని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు ఏం మొఖం పెట్టుకొని మాట్లాడుతారు. విభజన హామీలు ఏమయ్యాయి? బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్శిటీ ఎక్కడ పోయాయి? వెనుక బడ్డ ప్రాంతాలకు నిధులేవి? మోదీ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేది అన్యాయం అంటూ హరీష్ ఎద్దేవా చేశారు.

బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఎక్కడచూసినా ధరల పెంపు, వివక్ష తప్ప దేశానికి కూడా చేసిందేం లేదు. పెట్రోల్ ధర పెంచింది, ఎరువుల ధర పెంచింది, వ్యవసాయాన్ని ముంచింది. యూపీ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ప్రజలపై భారం తప్పదు, ప్రజలు గమనించాలి అంటూ హరీష్ రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంపై మాట్లాడే హక్కు మోదీకి లేదు

తెలంగాణ ప్రజలను, 1200 మంది అమరుల త్యాగాలను అవహేళన చేస్తూ పీఎం మోదీ మాట్లాడారంటూ టీఆర్ఎస్వీ అధ్వర్యంలో హైదరాబాద్ లోని బషీర్బాగ్ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీకి తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని టీఆర్ఎస్వీ నేతలు మండిపడ్డారు.

IPL_Entry_Point