Mpox: గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ వార్డు.. అన్ని జిల్లాలను అలర్ట్ చేసిన ఆరోగ్య శాఖ-telangana health department has set up a monkeypox ward at gandhi hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mpox: గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ వార్డు.. అన్ని జిల్లాలను అలర్ట్ చేసిన ఆరోగ్య శాఖ

Mpox: గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ వార్డు.. అన్ని జిల్లాలను అలర్ట్ చేసిన ఆరోగ్య శాఖ

Basani Shiva Kumar HT Telugu
Aug 23, 2024 02:30 PM IST

Mpox: ఢిల్లీ, కేరళలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. గాంధీ అస్పత్రిలో ప్రత్యేకంగా మంకీపాక్స్ వార్డును ఏర్పాటు చేసింది. అటు అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ వార్డు
గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ వార్డు

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్య శాఖ మంకీపాక్స్ వార్డు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో మంకీపాక్స్ కేసులు నమోదు కాకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తలో భాగంగా గాంధీ ఆస్పత్రిలో వార్డు ఏర్పాటు చేశారు. మరోవైపు మంకీపాక్స్ విషయంలో నిర్లక్ష్యం వద్దని ఇప్పటికే అన్ని జిల్లాలను ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది. ప్రత్యేక వార్డులు, మెడికల్ కిట్‌లు అందుబాటులో ఉంచుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో అన్ని జిల్లాల్లో అధికారులు అలెర్ట్ అయ్యారు.

ఉన్నతస్థాయి సమీక్ష..

మంకీపాక్స్ భారత్‌లో వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ గాంధీ, ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వైద్యారోగ్య శాఖ అలెర్ట్..

మంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. తొలుత గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అలాగే అవసరమైన మెడికల్ కిట్‌లు, మందులు అందుబాటులో ఉంచారు. జిల్లాల్లోనూ అన్ని సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడైనా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వస్తే.. వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు జిల్లాల్లోనూ వైద్యారోగ్య శాఖ అధికారులు అలెర్ట్ అయ్యారు.

2022 నుంచి..

  • మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో డబ్యూహెచ్ వో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ మరుసటి రోజే స్వీడన్‌లో తొలిసారిగా మంకీపాక్స్ కేసు నమోదైంది. దీనిని ప్రమాదకరమైన క్లేడ్ Iబి వేరియంట్‌గా వైద్యులు గుర్తించారు. మంకీపాక్స్‌ను మొదట 1958లో కోతుల్లో గుర్తించారు. ఆ తరువాత 1970లో కాంగోలో మనుషుల్లో కనిపించింది. 2022 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు నమోదు కావడం మొదలైంది. దీంతో అన్ని దేశాలు అలెర్ట్ అయ్యాయి.

మంకీపాక్స్ లక్షణాలు..

మంకీపాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. దీంతో పాటు జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి వస్తుంది. ఇది సోకిన వారు బలహీనపడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే.. కొంతమందిలో మంకీపాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తే.. మరి కొంతమందిలో అది వేరే రకంగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది సోకిన వ్యక్తి వెళ్లిన వారికి వారంలో లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.