Monkeypox : కరోనా తరహాలో మంకీపాక్స్ డేంజర్ బెల్స్, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Monkeypox Symptoms : కరోనా తర్వాత ప్రపంచాన్ని మరోసారి కంగారు పెట్టించిన వ్యాధి మంకీపాక్స్. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో మొట్టమొదటి సారిగా బయటపడిన ఈ వ్యాధి ఇప్పటికే 13 దేశాలకి విస్తరించింది. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలు, యువత ఉండటంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలెర్ట్
Monkeypox Treatment : కరోనా మహమ్మారి తరహాలో మరో వ్యాధి ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తోంది. రెండేళ్ల క్రితం ఆఫ్రికా దేశాల్ని కుదిపేసిన మంకీపాక్స్, ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కరోనా తరహాలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని తాజాగా ప్రకటించింది.
మంకీపాక్స్ వ్యాప్తి ఎక్కడ ఉంది?
ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది దాదాపు 10వేల కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా 500 మందికి పైగా చనిపోయారు. గత ఏడాదితో పోలిస్తే కేసులతో పాటు మరణించిన వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో చెప్తోంది. మంకీపాక్స్ ఇప్పుడు 13 ఆఫ్రికన్ దేశాల్లో యాక్టీవ్‌గా ఉందని వెల్లడించింది. అలానే 160% కేసులు, మరణాలు 19% పెరగడం ఆందోళన కలిగించే విషయం.
మంకీపాక్స్ వైరస్ డేంజరా?
గతంతో పోలిస్తే మంకీపాక్స్ కొత్త వేరియెంట్‌లో ఇప్పుడు కనిపిస్తోంది. శరీరంలోకి సోకిన తర్వాత ఆరంభంలోనే ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించడం వైద్యులకి కూడా కష్టం అవుతోంది. దాంతో వ్యాధి సోకిన వారు తమకి తెలియకుండానే ఇతరులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తున్నారు. కొత్త వేరియంట్ బాధితులకి ఎక్కువగా ఛాతీ, చేతులు, కాళ్లకి గాయాలు కనిపిస్తాయి.
వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
మంకీపాక్స్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లి మాట్లాడటం లేదా తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అలానే వ్యాధి బారినపడిన వారి దుస్తులు, వస్తువులను తాకడం ద్వారా కూడా వైరస్ సంక్రమించవచ్చు.
మంకీపాక్స్‌ను ఎలా గుర్తించాలి?
మంకీపాక్స్ వ్యాధి సోకిన వ్యక్తికి 21 రోజులలోపు శరీరంలో మార్పులు వస్తాయి. చర్మంపై దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి బాధిస్తుంది. దాంతో క్రమంగా శక్తి తగ్గడం మొదలవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే మంకీపాక్స్‌గా గుర్తించాలి. చర్మంపై దద్దుర్లు ఏర్పడిన గంటల వ్యవధిలో దురద మొదలవుతుంది. దాంతో వాటిని టచ్ చేస్తే వ్యాధి ప్రభావం పెరిగి పుండుగా మారుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
మంకీపాక్స్‌తో చనిపోతారా?
మంకీపాక్స్ తీవ్రంగా మారితే అది న్యుమోనియాకు దారితీస్తుంది. చూపు మందగించడం, వాంతులు, అతిసారం, జననేంద్రియాల వద్ద వాపుతో తీవ్రమైన నొప్పి వస్తుంది. వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వ్యాధి సోకిన వ్యక్తి మరణించే ప్రమాదం లేకపోలేదు.
భారతదేశంలో మంకీపాక్స్ ముప్పు ఉందా?
భారత్‌లో 2022లో మొట్ట మొదటిసారి మంకీపాక్స్‌ని గుర్తించారు. ఆ తర్వాత గత ఏడాది జూలైలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 27 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ, ఢిల్లీ నుంచే అత్యధికం. ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కి వచ్చే ప్రయాణికుల ద్వారా మంకీపాక్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
మంకీపాక్స్ నివారణ చర్యలు
మంకీపాక్స్ నుంచి సురక్షితంగా ఉండటానికి మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. విదేశీ ప్రయాణాలు చేసిన వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పడు కాస్త దూరంగా ఉండి మాట్లాడాలి. అలానే దద్దుర్లు, జ్వరం, మంకీపాక్స్ తదితర లక్షణాలు ఉన్న వారు ఎవరైనా కనిపిస్తే వారికి దూరంగా ఉండటం ఉత్తమం.