TG Govt Holiday : విద్యార్థులకు మళ్లీ గుడ్ న్యూస్ - రేపు ఈ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు!
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆసిఫాబాద్ జిల్లాలో రేపు(అక్టోబర్ 17) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో దసరా సెలవులు పూర్తి అయిన తర్వాత అక్టోబర్ 15వ తేదీన బడులు తెరుచుకున్నాయి. దాదాపు 13 రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇదిలా ఉంటే… కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యార్థులకు విద్యాశాఖ మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉత్తర్వలు జారీ చేశారు.
కొమురం భీమ్ జయంతి - సెలవుపై ప్రకటన
అక్టోబర్ 17వ తేదీన ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీమ్ 84వ వర్ధంతి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్నఅన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అక్టోబర్ 17న సెలవు ప్రకటించన నేపథ్యంలో… నవంబర్ 9న పాఠశాలలు పని చేయనున్నాయి. ఆ రోజు రెండో శనివారం ఉన్నప్పటికీ వర్కింగ్ డేగా నిర్ణయించింది.
కొమురం భీమ్ ఆదివాసీ పోరాటయోధుడిగా పేరొందాడు. జల్- జంగల్- జమీన్.. అనే నినాదాన్ని ఎత్తుకొని పోరాటం సాగించాడు. నీరు- అడవి- భూమిపై హక్కులు తమవేనంటూ ఉద్యమం ప్రారంభించాడు. ఏ నాటికైనా చచ్చేదే, ఈ బ్రతుకు కంటే ఆ చావే గొప్పదంటూ తన తోటి వారిలో ఉద్యమ స్పూర్థి రగిలించాడు. మేమూ తోడవుతాం అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా కొమురం భీమ్ అనుచరులుగా తరలివచ్చారు. కొమరం భీమ్ నాయకత్వంలో గూడెం ఊర్లన్నీ తన వెంటే నడిచాయి. ఇక వారితోనే జోడేఘాట్ కేంద్రంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పర్చుకొని నిజాం పాలకులపై గెరిల్లా పోరాటాలకు దిగాడు భీమ్.
భీమ్ చేపట్టిన సాయుధ ఉద్యమం ఉధృతమవుతూ వచ్చింది. భీమ్ నాయకత్వంతో గూడెంలలో నైజాం పాలన గాడి తప్పింది. దీంతో తనకు, వారికి భూములిస్తాం, టాక్సులెత్తివేస్తాం అంటూ ప్రభుత్వం నుంచి ఆఫర్లు వచ్చాయి. అయినా సరే వాటికి భీమ్ లొంగలేదు. తమ బ్రతుకులు మారాలంటే తమ ప్రాంతంలో పాలన తమదే అయి ఉండాలి అని భీమ్ తెగేసి చెప్పాడు. భీంను నేరుగా టచ్ చేసే పరిస్థితి కూడా పాలకులకు లేదు. అందుకోసం నైజాం ప్రభుత్వం కొమరం భీమ్ వద్ద సన్నిహితంగా మెలిగే కుర్దు పటేల్ సహాయం తీసుకుంది. కుర్దు పటేల్ వెన్నుపోటుతో నైజాం ఆర్మీ భారీ ఎత్తున జోడెఘాట్ ప్రాంతంలో మోహరించింది. అన్నివైపులా చుట్టుముట్టి కొమరం భీంపై తూటాల వర్షం కురిపించడంతో 39 ఏళ్లకే 1940లో కొమరం భీం నేలరాలాడు.
31న దీపావళి సెలవు:
అక్టోబర్ 31న దీపావళి పండగ ఉండటంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు అక్టోబర్ 20, 27 ఆదివారాల్లోనూ స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇటు దసరా సెలవులు ముగియగానే.. అక్టోబర్ 21 నుండి 28 వరకు ఎస్ఏ 1 ఎగ్జామ్స్ నిర్వహించేందుకు స్కూళ్లు ఏర్పాట్లు చేస్తున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది.
టాపిక్