Asifabad District : ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం..! జైనూరులో ఉద్రిక్తత పరిస్థితులు, కర్ఫ్యూ విధింపు-communal tensions erupt after rape attempt on tribal woman in in jainoor asifabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Asifabad District : ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం..! జైనూరులో ఉద్రిక్తత పరిస్థితులు, కర్ఫ్యూ విధింపు

Asifabad District : ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం..! జైనూరులో ఉద్రిక్తత పరిస్థితులు, కర్ఫ్యూ విధింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 04, 2024 10:15 PM IST

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం ఘటనతో నిరసనలు చెలరేగాయి. దీంతో ఆస్తి నష్టం వాటిల్లింది. మరోవైపు స్థానికంగా కర్ఫ్యూ విధిస్తూ డీజీపీ ఆదేశాలను జారీ చేశారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జైనూర్ లో ఉద్రిక్త పరిస్థితులు
జైనూర్ లో ఉద్రిక్త పరిస్థితులు

ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల పరిధిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాఖీ పౌర్ణమి రోజు ఆదివాసీ మహిళపై మగ్దూం అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆదివాసీ, గిరిజన సంఘాలు బుధవారం బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే  స్థానికంగా అల్లర్లు చెలరేగాయి.

నిందితుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే సదరు మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించగా ఆమె ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసేందుకు యత్నించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

సెప్టెంబరు 1న బాధితురాలి తమ్ముడు నిందితుడిపై సిర్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిపై అత్యాచారయత్నం, హత్యతో పాటు  ఎస్సీ/ఎస్టీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశారు.

ఈ ఘటనను ఖండిస్తూ ఆదివాసీ సంఘాలు బుధవారం బంద్ చేపట్టాయి. ఈ క్రమంలోనే స్థానికంగా అల్లర్లు చెలరేగాయి. పలు దుకాణాలపై దాడులు చేయటంతో పాటు కార్లను ధ్వంసం చేశారు.

తెలంగాణ టుడే కథనం ప్రకారం… ఈ ఘటనను ఖండిస్తూ జైనూర్‌లో 5,000 మంది వరకు నిరసనకారులు గుమ్మిగూడారు. ఈ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకుంది. వ్యాపార దుకాణాలకు  నిప్పంటించారు. మతపరమైన నిర్మాణాలపై రాళ్లు రువ్వారు. దీంతో జైనూరులో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ గిరిజన హక్కుల సంఘాలు జైనూర్‌లో మంగళవారం రాస్తారోకో నిర్వహించాయి. ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉద్రిక్త పరిస్థితులపై డీజీపీకి లేఖ రాశారు. శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

మరోవైపు ఈ ఘటనను బీజేపీ తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిామాండ్ చేస్తున్నారు. అత్యాచారం కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

జైనూరులో కర్ఫ్యూ - డీజీపీ

జైనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలను జారీ చేశారు. జైనూరులో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు కర్ఫూ అమల్లో ఉంటుందన్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ నిలిపివేశారు.

“రెండు వర్గాల మధ్య ఘర్షణలు, రాళ్ల దాడి జరగటంతో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు రంగంలోకి వెయ్యి మంది పోలీసులు దిగారు. ప్రస్తుతానికి పోలీసు పహారాలోనే జైనూరు ఉంది. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు” అని డీజీపీ హెచ్చరించారు.

 

టాపిక్