Telangana Investments: రూ.31వేల కోట్ల పైగా పెట్టుబడులు,30వేల ఉద్యోగాలు.. రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనలు గ్రాండ్ సక్సెస్-telangana as an investment destination revanth reddys foreign tours are a grand success ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Investments: రూ.31వేల కోట్ల పైగా పెట్టుబడులు,30వేల ఉద్యోగాలు.. రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనలు గ్రాండ్ సక్సెస్

Telangana Investments: రూ.31వేల కోట్ల పైగా పెట్టుబడులు,30వేల ఉద్యోగాలు.. రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనలు గ్రాండ్ సక్సెస్

Sarath chandra.B HT Telugu
Aug 13, 2024 01:34 PM IST

Telangana Investments: విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం చేపట్టిన పర్యటన విజయంవంతం అయ్యింది. గత పది రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియాలో చేస్తున్న పర్యటనల్లో 31వేల కోట్లకు పైగా పెట్టుబడులు 30వేల ఉద్యోగాలు తెలంగాణకు రానున్నాయి.

న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజీలో సీఎం రేవంత్ ప్రతినిధుల బృందం
న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజీలో సీఎం రేవంత్ ప్రతినిధుల బృందం

Telangana Investments: పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేపట్టిన పర్యటన విజయవంతం అయ్యింది. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించడంలో రేవంత్ బృందం విజయం సాధించింది. పది రోజులుగా అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియాలో రేవంత్ బృందం పర్యటిస్తోంది. ఈ పర్యటనలో అమెరికా నుంచి దాదాపు రూ.31వేల కోట్ల రుపాయల విలువైన పెట్టుబడులు, 30వేల ఉద్యోగాలు తెలంగాణకు రానున్నాయి.  ప్రస్తుతం దక్షిణ కొరియా రాజధాని సియోల్ ‌లో రేవంత్ బృందం పర్యటిస్తోంది.

హైదరాబాద్‌ మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి గారు సియోల్ లోని #Cheonggyecheon నదిని ప్రపంచస్థాయి వాటర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించారు. నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నులను గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలంగాణలో హ్యుండాయ్‌ పెట్టుబడులు
తెలంగాణలో హ్యుండాయ్‌ పెట్టుబడులు

తెలంగాణలో హ్యుందాయ్ (Hyundai) మెగా టెస్టింగ్ సెంటర్

ప్రపంచ ప్రఖ్యాత హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) సంస్థ తన సరికొత్త మెగా టెస్టింగ్ సెంటర్ ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. భారీ ఎత్తున ఏర్పాటు కానున్న మెగా టెస్టింగ్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం (EVలతో సహా) ఉంటుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ప్రతినిధులతో ఈ మేరకు చర్చలు జరిపింది.

ఎల్‌ఎస్‌ గ్రూప్‌తో భేటీ…

దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనలో కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ (LS Group) చైర్మన్ కు-జాఉన్ (Koo Ja-eun) గారితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ (LG Group) వ్యవస్థాపకులైన LS Group కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ (LS Group) ఆసక్తి కనబర్చింది.

అమెజాన్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకుంటున్న శ్రీధర్ బాబు
అమెజాన్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకుంటున్న శ్రీధర్ బాబు

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) విస్తరణ

అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు.

హైద‌రాబాద్‌లో మోనార్క్ ట్రాక్ట‌ర్స్ విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌

హైద‌రాబాద్‌లో త‌మ సంస్థ విస్త‌ర‌ణ‌కు మోనార్క్ ట్రాక్ట‌ర్ (Monarch Tractor) సంస్థ ముందుకు వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోని త‌మ ప‌రిశోధ‌న-అభివృద్ధి సంస్థ‌ను విస్త‌రించే అంశంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. ఉన్నతాధికారులతో కూడిన తెలంగాణ ప్ర‌తినిధి బృందంతో మోనార్క్ సంస్థ ప్ర‌తినిధులు చ‌ర్చించారు.

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల సాధ‌నే ల‌క్ష్యంగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మోనార్క్ ట్రాక్ట‌ర్ (Monarch Tractor) సంస్థ ప్ర‌తినిధులు క‌లిశారు. అనంత‌రం సంస్థ ప్ర‌తినిధులు హైదరాబాద్‌లో త‌మ ఆర్ అండ్ డీ సంస్థ‌కు అనుబంధంగా స్వయంప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

తెలంగాణలో పెట్టుబడులకు మోనార్క్ ట్రాక్టర్స్ ఆసక్తి
తెలంగాణలో పెట్టుబడులకు మోనార్క్ ట్రాక్టర్స్ ఆసక్తి

హైదరాబాద్‌లో జొయిటిస్ (Zoetis) విస్తరణ

ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ (Zoetis Inc.) కంపెనీ హైదరాబాద్‌లో తమ కెపాబులిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.

స్టాన్‌ ఫోర్డ్ యూనివర్శిటీలో సిఎం రేవంత్‌ రెడ్డి బృందం
స్టాన్‌ ఫోర్డ్ యూనివర్శిటీలో సిఎం రేవంత్‌ రెడ్డి బృందం

తెలంగాణకు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ సహకారం

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ (Stanford University)ని సందర్శించింది. స్టాన్ పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ (Stanford's Byers Center for Biodesign) విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది.

తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం స్టాన్ ఫోర్డ్ వారిని ఆహ్వానించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. తెలంగాణలో స్టాన్‌ ఫోర్డ్ బయోడిజైన్ శాటి లైట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి.

కాగ్నిజెంట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం
కాగ్నిజెంట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం

ఆరమ్ ఈక్విటీ (Aurum Equity) రూ.3350 కోట్ల పెట్టుబడులు

ప్రఖ్యాత ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ (Aurum Equity Partners) తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3350 కోట్లు) పెట్టుబడులకు సిద్ధపడింది.

హైదరాబాద్‌లో నెక్స్ట్-జనరేషన్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్‌ నిర్మించనున్నట్లు ప్రకటించింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు Aurum Equity సంస్థ తెలిపింది. గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు రూ.3350 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది.

హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ (AMGEN) కొత్త రీసెర్చ్ సెంటర్

ప్రపంచంలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్‌జెన్ (Amgen Inc) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్‌లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఆమ్‌జెన్ (Amgen) కొత్త రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.

తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ.. ప్యూచర్​ స్టేట్​

తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అమెరికాలో పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు.

కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడారు.

‘న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించిన తర్వాత కాలిఫోర్నియాలో పర్యటన సందర్భంగా రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఇండియాలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవని ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందామని. ఇకపై రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్​.. అని పిలుద్దాం..’ అని సీఎం ప్రకటించారు.

వివింట్ ఫార్మా (Vivint Pharma) రూ. 400 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ (Vivint Pharma) కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది. సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్ లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది.

బయో ఇథనాల్ ప్లాంట్‌ ఏర్పాటుపై ఒప్పందాలు
బయో ఇథనాల్ ప్లాంట్‌ ఏర్పాటుపై ఒప్పందాలు

తెలంగాణలో 2జీ బయో ఇథనాల్‌ ప్లాంట్‌

బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పనుంది. మొదటి దశలో దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

హైదరాబాద్‌లో ఆర్సీజియం (Arcesium) విస్తరణకు ఒప్పందం

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం (Arcesium) హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది.

ఆర్సీజియం (Arcesium) అంతర్జాతీయంగా బయటి దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

ట్రైజిన్ ప్రతినిధులతో రేవంత్‌ రెడ్డి బృందం చర్చలు
ట్రైజిన్ ప్రతినిధులతో రేవంత్‌ రెడ్డి బృందం చర్చలు

హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్

ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు.

Trigyn కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. హైదరాబాద్ లో ట్రైజిన్ (Trigyn) కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తుంది.

హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్

ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.

సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ది కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్​ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది.

కర్రా హోల్డింగ్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
కర్రా హోల్డింగ్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

అమెరికా పర్యటనలో రూ.31,532 కోట్ల పెట్టుబడులు, 30వేల ఉద్యోగాలు

ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది.

అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

ఎల్‌ఎస్‌ గ్రూపు ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం
ఎల్‌ఎస్‌ గ్రూపు ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం

సంబంధిత కథనం