Hyderabad : అశోక్‌నగర్‌లో యువతి సూసైడ్... పరీక్షల వాయిదానే కారణమంటూ అభ్యర్థుల భారీ ఆందోళన
Hyderabad News: హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. అయితే ఉద్యోగ పరీక్షల వాయిదానే ప్రవళిక ఆత్మహత్యకు కారణమంటూ అభ్యర్థులు భారీ ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం రాత్రి అశోక్ నగర్ పరిధిలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
Student Suicide in Ashok Nagar: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఒక అభ్యర్థిని సూసైడ్ కు పాల్పడటం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సూసైడ్ చేసుకున్న అభ్యర్థిని వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) గా గుర్తించారు. అయితే ప్రవళిక సూసైడ్ పై మిగతా అభ్యర్థులు భారీ ఆందోళనకు దిగారు. పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలోనే ఒత్తిడికి గురై ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడిందని… ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇక ప్రవళిక గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. శుక్రవారం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని… స్వస్థలానికి మృతేదేహాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే ప్రవళిక సూసైడ్ విషయం తెలుసుకున్న ఉద్యోగ అభ్యర్థులు భారీ చేరుకున్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. అభ్యర్థుల ఆందోళనకు పలువురు రాజకీయ పార్టీల నేతలు కూడా మద్దతుగా నిలిచారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
ఓ దశలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో అభ్యర్థుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురైంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని… ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని అభ్యర్థులు నినాదాలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రవళిక ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్… ప్రవళిక మృతిపై నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. ఈ సూసైడ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ… విద్యార్థిని సూసైడ్ చాలా బాధాకరమన్నారు. ఇది సూసైడ్ కాదు… యువత కన్న కలలు, ఆశలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మర్డర్ గా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే… ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేస్తామన్నారు. ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.