Basara IIIT Student Suicide : అమ్మ, నాన్న నన్ను క్షమించండి.. కంటతడి పెట్టిస్తున్న విద్యార్థిని స్వాతి సూసైడ్ లెటర్-student swathi commits suicide at basar iiit campus ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Basara Iiit Student Suicide : అమ్మ, నాన్న నన్ను క్షమించండి.. కంటతడి పెట్టిస్తున్న విద్యార్థిని స్వాతి సూసైడ్ లెటర్

Basara IIIT Student Suicide : అమ్మ, నాన్న నన్ను క్షమించండి.. కంటతడి పెట్టిస్తున్న విద్యార్థిని స్వాతి సూసైడ్ లెటర్

Basara IIIT Student Suicide : భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఆ విద్యార్థిని క్యాంపస్‌లోకి అడుగుపెట్టింది. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి చదువుతోంది. కానీ.. సీనియర్ విద్యార్థిని బాయ్ ఫ్రెండ్ ఆమె ఆశలను చిధిమేశాడు. సూసైడ్ చేసుకునేలా చేశాడు.

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు ముందు విద్యార్థిని స్వాతి ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసింది. అమ్మ, నాన్న క్షమించండి అంటూ లెటర్ రాసింది. విద్యార్థిని స్వాతి రాసిన లేఖ కంట తడి పెట్టిస్తోంది. స్వాతి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

స్వాతి లేఖ సారాంశాం ఇది..

'అమ్మ, నాన్న నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది. సూసైడ్‌ చేసుకోవాలంటే భయంగా ఉంది. గత నెల 4న నన్ను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశా. సీనియర్‌ విద్యార్థిని భాయ్‌ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి.. బూతులు తిడుతున్నాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ.. ఫిర్యాదును ట్రిపుల్‌ ఐటీ అధికారులు పట్టించుకోలేదు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నా. నన్ను క్షమించండి' అంటూ స్వాతి లేఖ రాసింది.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన స్వాతిప్రియ(17) బాసర ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చుదువుతోంది. సోమవారం ఉదయం తోటి విద్యార్థులు టిఫిన్ చేయడానికి మెస్‌కు వెళ్లగా.. స్వాతిప్రియ మాత్రమే గదిలో ఒంటరిగా ఉంది. తోటి విద్యార్థులు లేని సమయంలో.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆత్మహత్యకు ముందు స్వాతి తన తోటి విద్యార్థినికి మెసేజ్‌ చేసింది. కంగారుపడ్డ ఆ విద్యార్థిని వేగంగా వచ్చింది. అప్పటికే స్వాతి ఫ్యానుకు వేళాడుతూ కనిపించింది. అయితే.. కొన ఊపిరితో ఉన్న స్వాతిని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే స్వాతిని కాపాడేవారిమని తోటి విద్యార్థినులు చెబుతున్నారు.

స్వాతి తన స్నేహితురాలి ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే సీనియర్‌ విద్యార్థి వేధింపులు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్‌ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు.

బాసర ట్రిపుల్‌ ఐటీలో వరుస ఆత్మహత్యలు సంచలనంగా మారాయి. పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిలిస్తోంది. మరోవైపు యూనివర్సిటీ లోపాలు విద్యార్థులకు శాపాలుగా మారాయి. వారి ప్రాణాలను తీస్తున్నాయి. సమస్యలతో విద్యార్థులు చదువు సాగించలేక ఒత్తిడికి గురై తనువు చాలిస్తున్నారు. రెండేళ్లలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 8 మంది మైనర్లు కావడం గమనార్హం.