IIIT Suicide: ప్రాణం తీసిన సెల్‌ఫోన్, చోరీ ఆరోపణలు తట్టుకోలేక ట్రిపుల్ ఐటీలో విద్యార్ధిని ఆత్మహత్య
IIIT Suicide: మొబైల్ ఫోన్ ఓ విద్యార్ధిని ప్రాణాలు బలితీసుకున్నాయి. హాస్టల్లో కనిపించకుండా పోవడానికి ఓ విద్యార్ధిని కారణమనే ఆరోపణల నేపథ్యంలో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
IIIT Suicide: మొబైల్ ఫోన్ ఓ విద్యార్ధిని ప్రాణాలు బలితీసుకున్నాయి. హాస్టల్లో కనిపించకుండా పోవడానికి ఓ విద్యార్ధిని కారణమనే ఆరోపణల నేపథ్యంలో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వేరే విద్యార్ధినికి చెందిన సెల్‌ఫోన్ అపహరించినట్టు నిందించడంతో మనస్తాపానికి గురైన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరిగింది.
బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సయ్యద్ మగ్బూల్, నసీమ దంపతుల కుమార్తె జమీషా ఖురేషి…ఇడుపులపాయ క్యాంపస్‌లోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పీటూ చదువుతోంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సమానమైన పీయూసీ కోర్సును అభ్యసిస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం ట్రిపుల్‌ఐటీ హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని తనఫోన్ మరచి పోయారు. ఆ తర్వాత కాసేపటికి తన ఫోన్ కనిపించడం లేదని హాస్టల్ ఇన్‌ఛార్జి ఇమ్రాన్ షరీఫ్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సీసీ ఫుటేజీ ఆధారంగా జమీషా ఖురేషి హాస్టల్ గది నుంచి బయటకు వెళ్లినట్టు గుర్తించారు. బుధవారం ట్రిపుల్‌ఐటీ అధికారులు విద్యార్ధిని తల్లిదండ్రులను హాస్టల్‌కు పిలిపించి వారి ముందు ఆమెను మందలించారు.
ఈ ఘటనతో జమీషా మనస్తాపానికి గురైంది. అవమానంగా భావించి అర్ధరాత్రి వసతి గృహంలోని స్నానాల గదిలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న తల్లిదండ్రులకు వారి కుమార్తె ఆరోగ్యం సరిగా లేదని ట్రిపుల్ ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లే సరికి ఆత్మహత్య చేసుకుందని చెప్పారని ఖురేషి తల్లిదండ్రులు వాపోయారు. ఆత్మహత్య చేసుకుంటే ఆరోగ్యం సరిగా లేదని ఎందుకు సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు.