Weaver couple Suicide : సిరిసిల్లలో విషాదం…. ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య
సిరిసిల్లలో నెలకొన్న వస్త్ర సంక్షోభం.. నేత కార్మికుల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా నేత కార్మిక కుటుంబానికి చెందిన దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులను కోల్పోవటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్ లో విషాదం నెలకొంది. పవర్ లూమ్ ఆసామిగా పనిచేసి ఇటీవల పవర్ లూమ్స్ అమ్మేసి బెడ్ కవర్స్ తయారు చేస్తున్న బైరి అమర్(41) స్రవంతి(38) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు పిల్లలను స్కూల్ కు పంపించి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
దంపతుల ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలే కారణమని స్థానికులు తెలిపారు. వస్త్ర సంక్షోభంతో పవర్ లూమ్ పరిశ్రమ సరిగా నడవక అమర్ తనకున్న నాలుగు జోడ్ల పవర్ లూమ్ లను అమ్మేశాడు. అప్పులు చేసి బెడ్ కవర్స్ తయారు చేస్తున్నాడు. అది కూడా గిట్టుబాటు కాక చేసేందుకు నేత పని నడవక అప్పులు భారంగా మారి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. పవర్ లూమ్ పరిశ్రమ సరిగా నడిచి, నేసిన గుడ్డకు గిట్టుబాటు ధర ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు.
అనాదలైన ముగ్గురు పిల్లలు…!
ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తలు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. స్కూల్ కు వెళ్ళి వచ్చేసరికి అమ్మానాన్న ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు కూతుళ్లు లహరి(16), శ్రీవల్లి(15) కొడుకు దిక్షిత్ నాథ్ (13) బోరున విలపించారు. అభంశుభం తెలియని పిల్లలు ముగ్గురు అమ్మానాన్నల మృతదేహాల వద్ద బిక్కుబిక్కుమంటూ చూడడం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. తాము ఏం పాపం చేశాము అన్నానాన్న మమ్ములను అనాధలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
90 లక్షల వరకు అప్పులు…!
ఆత్మహత్య చేసుకున్న ఆసామి అమర్ కు 90 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పవర్ లూమ్ పరిశ్రమతో జీవనం సాగించే అమర్, ఇటీవల వస్త్ర సంక్షోభంతో నాలుగు జోడ్ల పవర్ లూమ్ లను అమ్మేసి ఇల్లు కట్టుకున్నాడని తెలిపారు. ఇంటి కోసం కొంత, కొత్త బిజినెస్ కోసం మరికొంత అప్పు చేశాడని తెలిపారు.
ప్రస్తుతం కొత్త బిజినెస్ సరిగా నడవక అప్పులకు వడ్డీలు కూడా కట్టే పరిస్థితి లేక ప్రభుత్వ సహకారం అందక అప్పులు భారంగా భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితి మరో నేత కార్మికుడికి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న దంపతుల పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం