ఐదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్ భర్త లైంగిక దాడి.. ప్రిన్సిపల్ వీడియోలు తీసేవారని ఆరోపించిన విద్యార్థినులు
Sexual abuse on minor girl: అన్నమయ్య జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్ భర్త లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్, ఆమె భర్తపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసులు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పరిమళ భర్త బాలసుబ్బయ్య ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆదివారం సాయంత్రం లైగింక దాడికి పాల్పడ్డాడు.
పాఠశాల ఆవరణంలో ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్లిన విద్యార్థినికి ప్రిన్సిపల్ భర్త బాలసుబ్బయ్య మయామాటలు చెప్పి లైగింక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక వారిస్తున్నా వదలకుండా దాడికి పూనుకున్నాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే గొంతు నులిమి చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక మిన్నకుంది.
కానీ ధైర్యం చేసిన బాలిక సోమవారం తోటి విద్యార్థినులు, తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తోటి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమను కూడా ప్రిన్సిపల్ భర్త వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళనతో ప్రిన్సిపల్ పరిమళ పరారయ్యారు.
వీడియోలు తీసి భర్తకు పంపిన ప్రిన్సిపల్
బాలికలు ఉదయం పూట స్నానం చేసిన తరువాత దుస్తులు మార్చుకునే సమయంలో సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసి తన భర్తకు ప్రిన్సిపల్ పరిమళ వాట్సాప్‌లో పంపిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని విద్యార్థినులు పేర్కొన్నారు. సెలవు రోజు తమను కలిసేందుకు తల్లిదండ్రులు వస్తే, వారిని లోపలికి రానీయడం లేదని, అదే ఆమె భర్తను బాలికల పాఠశాలలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తే తిట్టడం, కొట్టడం చేస్తున్నారని విద్యార్థినీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ భర్త తమకు తిండి పదార్థాలు ఇస్తానంటూ తమపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని ఆదేవన వ్యక్తం చేశారు.
ప్రిన్సిపల్, ఆమె భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, పోక్సో కేసు
సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లె ఎస్ఐ రవీంద్రబాబు సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారించారు. వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ భర్త బాలసుబ్బయ్యను అదుపులోకి తీసుకున్నారు. బాలికను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపల్, ఆమె భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, పోక్సో కేసు నమోదు చేసినట్లు లక్కిరెడ్డిపల్లి సీఐ వెంకటకొండా రెడ్డి, ఎస్.ఐ రవీంద్రబాబు పేర్కొన్నారు. ఘటనపై విచారించేందుకు కలెక్టర్ చామకూరి శ్రీధర్ గురుకుల పాఠశాలకు చేరుకుని బాలికలతో మాట్లాడారు. ప్రిన్సిపల్ భర్త నుంచి తమకు లైంగిక వేధింపులు ఉన్నట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను కలెక్టర్ పరామర్శించారు.
మంత్రి రాంప్రసాద రెడ్డి రూ.లక్ష సాయం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంతరి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపల్ పరిమళను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బాధితురాలి కుటుంబానికి తన వంతు సాయంగా రూ.లక్ష అందజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు.
-జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు