Vemulawada Kidnap: వృద్ధురాలు కిడ్నాప్... ఛేదించిన వేములవాడ పోలీసులు...ఇద్దరు అరెస్టు..మరో నలుగురు పరారీ
Vemulawada Kidnap: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధురాలు కిడ్నాప్ కు గురయ్యింది. కొడుకు మాట తప్పి తప్పించుకోవడంతో కోపంతో తల్లిని కిడ్నాప్ చేసిన వారు కటకటాల పాలయ్యారు. వృద్ధురాలను కిడ్నాప్ చేసిన ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వేములవాడ పోలీసులు ప్రకటించారు.
Vemulawada Kidnap: చెరుకు కోత పనులకు కూలీలను తీసుకువస్తానని డబ్బులు తీసుకుని వ్యవసాయ కూలీలను సమకూర్చక పోవడంతో తలెత్తిన వివాదంలో కూలీ తల్లి కిడ్నాప్‌కు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. డబ్బులు తీసుకున్న వ్యక్తి నుంచి వాటిని వసూలు చేసుకోడానికి వృద్ధురాలైన అతని తల్లిని నిందితులు ఎత్తుకుపోయారు. డబ్బులివ్వాల్సిన వ్యక్తి భార్యను అపహరించే ప్రయత్నం చేయగా ఆమె పారిపోవడంతో అతని తల్లిని నిందితులు బలవంతంగా తీసుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది.
వ్యవసాయ కూలీలను సమకూరుస్తానని ఇచ్చిన మాట తప్పినందుకు కూలీ పనులు చేసే వ్యక్తి తల్లిని కిడ్నాప్ చేసిన వారు కటకటాల పాలయ్యారు. వృద్ధురాలను కిడ్నాప్ చేసిన ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వేములవాడ పోలీసులు ప్రకటించారు.
వేములవాడ మండలం కొడుముంజ గ్రామంలో నివాసం ఉండే ఒడిస్సాకు చెందిన కూలీ మేస్త్రీ శ్రీనివాస్ కూలి పనుల కోసం మనుషులను పంపిస్తానని మహారాష్ట్రకు చెందిన లాలూదివాకర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లక్ష రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. శ్రీనివాస్ ఎంతకు మనుషులను పంపించక పోవడంతోపాటు పోన్ లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహించిన లాలుదివాకర్ ఆరుగురితో కొడుముంజకు చేరుకున్నాడు. శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో శ్రీనివాస్ తల్లి భీమాబాయ్ ని బలవంతంగా కారులో ఎక్కించుకుని (కిడ్నాప్) మహారాష్ట్రకు తరలించారు.
కిడ్నాప్ కేసు నమోదు..
ఈ ఘటనపై భీమ భాయ్ మనవడు పోలీసులను ఆశ్రయించడంతో వేములవాడ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వేములవాడ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం మహారాష్ట్రకు వెళ్ళి వృద్ధురాలు కిడ్నాప్ కేసును ఛేదించారు. వృద్ధురాలను క్షేమంగా స్వస్థలానికి తరలించారు. వృద్ధురాలును కిడ్నాప్ చేసిన లాలునాగొరావు అతని భార్య పంచాకుల రాయ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీఐ వీరప్రసాద్ ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)