SCR Special Trains : ప్రయాణికుల రద్దీ - ఈ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, తేదీలివే
South Central Railway Special Trains : దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుంచి ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి.
South Central Railway Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
తేదీలు, ట్రైమింగ్….
సికింద్రాబాద్-భావనగర్ (07061) మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. జులై 19, 26, ఆగస్టు 2, 9వ తేదీల్లో రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. మరుసటిరోజు 5.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
ఇక భావ్‌నగర్-సికింద్రాబాద్ (07062) మధ్య కూడా స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ జులై 21, 28, ఆగస్టు 4, 11 తేదీల్లో ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుతుంది.
ఆగే స్టేషన్లు….
ఈ ప్రత్యేక రైళ్లు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముఖ్దేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి, వాషిమ్, అకోల, భుస్వాల్, నందుర్బర్, సూరత్, వడోదర, అహ్మదాబాద్, విరాంగమ్, సురేంద్రనగర్, ధోలా, సోంగద్, సిహోర్(sihor) స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు బెంగళూరు-కాలబురిగి (06533) మధ్య దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. జులై 19వ తేదీన బెంగళూరు నుంచి రాత్రి 8 గంటలకు రైలు బయల్దేరి మరునాడు ఉదయం 07.45 నిమిషాలకు కాలబురిగిచేరుకుంటుంది.
ఇక కాలబురిగి నుంచి జులై 20వ తేదీన ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. ఉదయం 09. 30 గంటలకు బయల్దేరి…. ఇదే రోజు రాత్రి 08.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసేవలను వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.
రైళ్ల దారి మళ్లింపు….
విజయవాడ డివిజన్ మీదుగా అప్పికట్ల - నిడుబ్రోలు - సుందూరు స్టేషన్ల మధ్యమూడో లైన్‌ను ప్రారంభించేందుకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ / ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. అలాగే తిరునెల్వేలి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
జులై 22న హౌరాలో బయలుదేరే హౌరా-ఎస్ఎంవీ బెంగళూరు (22863 ) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కృష్ణా కెనాల్, గుంటూరు, నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట మీదుగా నడుపబడుతుంది. ఎర్నాకులం- హౌరా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22878) రైలు జులై 22, జులై 29 తేదీల్లో ఎర్నాకులంలో బయలుదేరి రేణిగుంట, యర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు, కృష్ణా కెనాల్ మీదుగా మళ్లించబడుతుంది. సంత్రాగచ్చి- తాంబరం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22841) రైలు జులై 22, జులై 29 తేదీలలో సంత్రగచ్చి నుండి బయలుదేరి కృష్ణా కెనాల్, గుంటూరు, నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట, చెన్నై ఎగ్మోర్ మీదుగా మళ్లించబడుతుంది.
మాల్దా టౌన్ నుండి బయలుదేరే మాల్దా టౌన్-ఎస్ఎంవీ బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (13434 ) రైలు 1ః30 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. జులై 21న ఉదయం 8:50 గంటలకు బయలు దేరాల్సిన రైలు, 1ః30 గంటల ఆలస్యంగా ఉదయం 10ః20 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది.
హౌరా నుండి బయలుదేరే హౌరా - మైసూర్‌ఎస్‌ఎఫ్ ఎక్స్‌ప్రెస్ (22817) రైలు గంట ఆలస్యంగా బయలుదేరుతుంది. జులై 21, జులై 26న ఉదయం 4:10 గంటలకు బయలుదేరాల్సిన రైలు, గంట ఆలస్యంగా ఉదయం 5:40 గంటలకు బయలుదేరుతుంది.