T Congress : పక్కాగా ‘ఆపరేషన్ ఆకర్ష్’... త్వరలోనే మరిన్ని చేరికలు, జాబితా ఇదేనా...?
Telangana Assembly Elections: తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఓవైపు ఎన్నికలకు సిద్ధమవుతూనే… ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెడుతోంది. కీలక నేతలను తమవైపు తిప్పుకునే పనిలో పడింది. కొల్లాపూర్ వేదికగా చాలా మంది నేతలు హస్తం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
Telangana Congress: కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో దూకుడు పెంచింది కాంగ్రెస్. అక్కడ భారీ విజయాన్ని సాధించగా... ఈసారి తెలంగాణలో కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో ఉంది. ఏడాది ముందు నుంచే ఎన్నికలపై కసరత్తు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్... ఇప్పటికే పలు భారీ సభలను తలపెట్టింది. కీలక హామీలపై డికర్లేషన్ లను ప్రకటించింది. రాబోయే రోజుల్లో రాహుల్, ప్రియాంక గాంధీ సభలను మరిన్ని తలపెట్టనుంది. ఇదిలా ఉంటే... గెలిచే అభ్యర్థులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్... ఆపరేషన్ ఆకర్ష్ ను విజయవంతంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. త్వరలోనే కొల్లాపూర్ వేదికగా భారీ సభను నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు పార్టీలోకి రప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ జాబితా కూడా చక్కర్లు కొడుతోంది.
బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మహేశ్వరం నుంచి పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ లో మరోసారి సబితా ఇంద్రారెడ్డికే టికెట్ అవకాశం ఉన్నందున్న... తీగల కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. మహేశ్వరంలో బలమైన నేతగా పేరున్న ఆయనకు... టికెట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక తీగల బాటలోనే మరికొందరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.
ప్రచారంలో ఉన్న పేర్లు ఇవే....!
ఉమ్మడి నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరిపారని సమాచారం. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి బీఆర్ఎస్ నేత, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మందుల సామెల్ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. వీరే కాకుండా.... గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి ఉన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తో కూడా హస్తం పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. వీరే కాకుండా... ఇతర నియోజకవర్గాల్లోని పలువురు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలో కొల్లాపూర్ వేదికగా భారీ సభను తలపెట్టబోతుంది కాంగ్రెస్. నిజానికి ఈనెల 20వ తేదీన నిర్వహించాలని అనుకున్నప్పటికీ... వర్షాల కారణంగా రద్దు చేశారు. త్వరలోనే మరో తేదీని ప్రకటించనున్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఆమె సమక్షంలోనే నేతలందర్నీ పార్టీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. రేపోమాపో చేరికలపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.