Ponnam Prabhakar : గీత కార్మికులకు గుడ్ న్యూస్- ప్రతి ఒక్కరికీ కాటమయ్య కిట్లు, త్వరలో మోపెడులు పంపిణీ
Minister Ponnam Prabhakar : గీత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత గీత కార్మికులకు మోపెడులు అందిస్తామన్నారు.
గీత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత గీత కార్మికులకు మోపెడులు అందిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...గీతా కార్మికులు రక్షణను దృష్టిలో పెట్టుకుని కాటమయ్య కిట్ లను తయారు చేశారన్నారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి ఈ కిట్ ఇస్తామన్నారు. తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండే పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్లపైన 50 శాతం ఈత చెట్లను నాటాలని సూచించారు. కాటమయ్య కిట్లను గీతా కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వచ్చే మార్చి గీత కార్మికులకు మోపెడులు ఇస్తామని మంత్రి తెలిపారు.
ప్రతి ఒక్కరూ 10 తాటి, ఈత మొక్కలు ప్రభుత్వ స్థలాల్లో, కాలువల గట్లపైన నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాటి చెట్ల పై నుంచి పడి గీత కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్ వారి ప్రాణాలు కాపాడుతుందన్నారు. ఖాళీ స్థలం ఉంటే బోర్లు వేసి తాటి, ఈత చెట్లను నాటి కాపాడుకోవాలని అన్నారు. బోర్ వేసే ప్రతిపాదన చేస్తే వెంటనే వేయిస్తామని మంత్రి తెలిపారు. అలాగా పాత బకాయిలు, ఎక్స్‌గ్రేషియా విడుదలయ్యేలా చూస్తామన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తామన్నారు.
కాటమయ్య కిట్టు
గీత కార్మికులు ఇప్పటికీ కుల వృత్తిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు కాలు, మోకు జారడంతో కల్లు గీత కార్మికులు ప్రమాదాల బారిన పడి శాశ్వత అంగవైకల్యం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో గీత కార్మికుల రక్షణకు, ప్రమాదాల నివారణగా రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం కిట్లను ప్రత్యేకంగా తయారు చేయించి పంపిణీ చేస్తుంది. బీసీ సంక్షేమ శాఖ, అబ్కారీ శాఖల ఆధ్వర్యంలో శిక్షకుల చేత గీత కార్మికులకు కిట్లపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కాటమయ్య కిట్లలో ఆరు రకాల వస్తువులు
కాటమయ్య కిట్లలో ఆరు రకాల వస్తువులు ఉన్నాయి. తాడు, లెగ్‌లూప్, క్లిప్పులు, స్లింగ్ బ్యాగ్, హ్యాండిల్ ఈ కిట్టులో ఉన్నాయి. తాటి, ఈత చెట్ల నుంచి కల్లు తీసేందుకు ముస్తాదు, గుయి, ధరించి కార్మికులు చెట్లు ఎక్కుతారు. ఈ కిట్టును ధరిస్తే కార్మికులకు రక్షణగా ఉంటుంది. ప్రమాదవశాత్తు మోకు జారిపోయినా, గుయి కింద పడిపోయినా కార్మికుడు జారిపోకుండా కిట్టుకు ఉన్న తాడు చెట్టుకు బిగుసుకుపోయి పైనే ఉండిపోతారు. అనంతరం కాలికి ధరించిన లెగ్‌లూప్ సాయంతో సులభంగా దిగవచ్చు.
సంబంధిత కథనం