Sangareddy News : ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్రోల్ పోస్తే బంక్ యజమానులపై చర్యలు- ఎస్పీ రూపేష్
Sangareddy News : ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్స్ లో పెట్రోల్ లలో పెట్రోల్ పోయవద్దని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ పోసినట్లైతే బంక్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Sangareddy News : ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ కొనుక్కొని కొంతమంది నేరస్థులు పలురకాల నేరాలకు పాల్పడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ పోయవద్దని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానులు పెట్రోలియం యాక్ట్ 2002 ప్రకారం పెట్రోల్ ను ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్ లలో పోయడానికి అనుమతి లేదన్నారు. వాహనాల ట్యాంక్ నందు మాత్రమే పెట్రోల్ పోయాలన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ పోసినట్లైతే పెట్రోల్ బంక్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని జిల్లా ఎస్పీ రూపేష్ హెచ్చరించారు. ప్రతి పెట్రోల్ బంక్ లో హై రెజల్యూషన్, నైట్ విజన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఆ కెమెరాల స్టోరేజ్ 90 రోజుల వరకు ఉండే విధంగా హార్డ్ డిస్క్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా బాటిల్స్ లో పెట్రోల్ పోయాలని బలవంతం చేసినట్లైతే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని అన్నారు.
క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలి
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా వాహనాల అతివేగం, అజాగ్రత్త, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్రలేమితనంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను అనుసరించకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఎస్పీ రూపేష్ తెలిపారు. మోటార్ సైకిల్ పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, మైనర్ లు డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని తెలిపారు. కారు నడిపేటప్పుడు సీట్ బెల్టు తప్పకుండా ధరించాలని, మోటార్ సైకిల్ వాహనదారులు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఎప్పుడూ ఎక్కడా ఎలా జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను గోల్డెన్ అవర్(ఒక గంటలోపు)లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ,ఇన్సూరెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని అన్నారు.
వాహనాలకు నంబర్ ప్లేట్స్ లేకపోతే చట్టరీత్యా చర్యలు
ప్రతి వాహనదారుడు రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు నెంబర్ ప్లేట్ లను వాహనాలకు బిగించుకోవాలని అన్నారు. నెంబరు ప్లేట్ లేని వాహనాల చోదకులు వేగంగా నడుపుతూ తోటి వాహదారులను, పాదాచారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నందున నంబరు ప్లేట్లులేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనదారులు అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడుపుతునందున్న ప్రమాదం జరిగే అవకాశం ఉందని నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో చాలా మంది వాహనదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలపై ప్రయాణిస్తున్నారని అది చట్టరీత్యా నేరమని తెలిపారు. అందుకు MV ACT ప్రకారం 200 రూపాయల ఫైన్, అదే నేరం రెండో సారి చేస్తే రూ.500 ఫైన్, మరలా అదే నేరం చేస్తే వాహనాన్ని సీజ్ చేసి కోర్టు ముందు హాజరుపరచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకనైనా తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని లేకపోతే వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని అన్నారు.
(హెచ్.టి. రిపోర్టర్, సంగారెడ్డి)
సంబంధిత కథనం