Fraud in Khammam : ఖమ్మంలో భారీ మోసం.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.2 కోట్లు దోచేశారు-rs 2 crores fraud by expecting high interest in khammam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fraud In Khammam : ఖమ్మంలో భారీ మోసం.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.2 కోట్లు దోచేశారు

Fraud in Khammam : ఖమ్మంలో భారీ మోసం.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.2 కోట్లు దోచేశారు

HT Telugu Desk HT Telugu
Oct 26, 2023 06:30 PM IST

Khammam Crime News:ఖమ్మంలో భారీ మోసం వెలుగు చూసింది. అధిక వడ్డీ ఆశ చూపి రూ.2 కోట్లు దోచేసిన వ్యవహరం బయటికి వచ్చింది. రోడ్డెక్కిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఖమ్మంలో భారీ మోసం - బాధితుల ఆందోళన
ఖమ్మంలో భారీ మోసం - బాధితుల ఆందోళన

Khammam Crime News : "మా ట్రేడింగ్ కంపెనీలో రూపాయి పెట్టుబడి పెట్టండి.. అతి తక్కువ కాలంలోనే ఊహించని రీతిలో మీరు పెట్టిన రూపాయిని రెట్టింపు చేసి మీకిస్తాం." కేవలం ఈ ఒక్క మాయ మాటతో ఖమ్మం జిల్లాలో ఓ బోగస్ ట్రేడింగ్ కంపెనీ కోట్ల సొమ్మును జనం నుంచి దోచేసింది. "మౌనిక ట్రేడింగ్ కంపెనీ" పేరుతో 2022లో పుట్టుకొచ్చిన ఈ బోగస్ కంపెనీ ఖమ్మంలో ఆఫీస్ ఓపెన్ చేసి మరీ జనం నుంచి కోట్లల్లో సొమ్ము కాజేసింది. రెండేళ్లు తిరగకుండానే సొమ్ములన్నీ దిగమింగిన నిర్వాహకులు ప్లేట్ తిప్పేశారు.

yearly horoscope entry point

ఈ మేరకు కొందరు బాధితులు ఖమ్మంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి తమ గోడును విలేకర్ల ఎదుట వెళ్లబోసుకున్నారు. గోరంట్ల అభిరామ్, కంచుమర్తి సైదులు, కొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 65 ఎకరాల విలువైన భూమిని చూపించి ఈ భూమి కంపెనీకి చెందినదేనని, దీన్ని డెవలప్ చేసి అమ్మిన తర్వాత మీ సొమ్ము మీకు తిరిగిచ్చేస్తామని చెప్పారన్నారు. "మీరు పెట్టే పెట్టుబడి కేవలం పది నెలల్లో రెట్టింపు చేసి మీ చేతికిస్తాం.." అనే ఒక్క నినాదానికి ఆశ పడి సంపాదించిన డబ్బు అంతా వాళ్ళ చేతిలో పోశామని వారు లబోదిబోమన్నారు. చిన్న, చిన్న వ్యాపారులు చేస్తూ తినీ, తినక కూడబెట్టిన డబ్బులు భవిష్యత్తులో పిల్లల అవసరాలకు ఉపయోగపడతాయని ఈ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే నిలువునా ముంచేశారని పేర్కొన్నారు. నేలకొండపల్లికి చెందిన వాసం రాధాకృష్ణ, ఖానాపురానికి చెందిన నార్ల మౌనిక, నార్ల మల్సూర్ అనే వ్యక్తులు ఈ బడా మోసానికి పాల్పడ్డారని చెప్పారు. తాము పెట్టిన పెట్టుబడికి పూచీకత్తుగా 65 ఎకరాల భూమిని చూపించారని చివరికి ఆరా తీస్తే ఆ భూమి వారిది కాదని తేలిందని వాపోయారు. దీంతో మేము మరింత ఆత్మరక్షణలో పడ్డామన్నారు. "మౌనిక ట్రేడింగ్" పేరుతో సొమ్మును బాంక్ ఖాతాలో వేసిన స్టేట్మెంట్లను కూడా వారు చూపించారు. సంవత్సరంన్నర నుంచి వాళ్ళ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకపోగా బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. వడ్డీ లేకపోయినా అసలు డబ్బును తిరిగివ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కొద్ది నెలల కిందట పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న స్టామ్ప్ కాగితాన్ని కూడా వారు ఖాతరు చేయట్లేదన్నారు.

లేకపోతే మీరైనా చావండి….

"డబ్బులు అడిగితే మేమైనా చేస్తాం.. లేకపోతే మీరైనా చావండి." అంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మమ్మల్ని ఎవరూ ఏం పీకలేరని దబాయిస్తున్నారని తెలిపారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తమ సోదరి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీకి రూ.15 లక్షలు అవసరమని, ఇవ్వాల్సిన డబ్బు తిరిగివ్వమని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకొమ్మని బెదిరిస్తున్నారని కంచుమర్తి సైదులు వాపోయారు. "నాకు అధికార పార్టీ అండ ఉంది.. ఎక్కడ ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశా.. ఇక నన్ను పీకేవాడే లేదు.." అంటూ దబాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారంలో సంపాదించిన డబ్బులన్నీ ఈ కంపెనీలోనే పెట్టుబడిగా పెట్టామని ఇప్పుడు వారి దబాయింపుతో మాకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైందని బోరుమన్నారు. మేము మొత్తం రూ.62 లక్షల సొత్తు పెట్టుబడిగా పెట్టామని ఎవరితో చెప్పుకోవాలో అంతు చిక్కని దుస్థితిలో ఉన్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మాలాగే చాలా మంది అమాయకులు మోసపోయారని రూ.2 కోట్లకు పైగా భారీ స్కామ్ జరిగిందని వెల్లడించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

Whats_app_banner