Rythu Bandhu Funds : వ్యవసాయేతర భూమికి రూ. 16 లక్షల 'రైతుబంధు' నిధులు - తిరిగి చెల్లించాలని అధికారుల నోటీసులు
Medchal-Malkajgiri District : సాగు చేయని భూమికి రూ. 16 లక్షల రైతుబంధు నిధులు అందాయి. మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు… ప్రభుత్వ సొమ్మును తిరిగి చెల్లించాలని నోటీసులను ఇచ్చింది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖరీఫ్ మరియు రబీ సీజన్ లో కలిపి ఎకరాకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేలు రైతుల ఖాతాలో జమ చేసేది.
చాలా చోట్ల రైతుబంధు నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చాయి. సాగు చేయని భూములకు, వ్యవసాయేతర భూములకు, హైవేలకు, ఫ్లాట్లకు,బడా భూస్వాములకు రైతుబంధు నిధులు పెద్దమొత్తంలో జమ చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే అక్రమంగా రైతుబంధు పొందిన వారి లెక్కలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీస్తుంది.
ఈ క్రమంలోనే వ్యవసాయేతర భూమిపై తప్పుడు పాత్రలు చూపించి అక్రమంగా రైతుబంధు నిధులను పొందిన ఓ బడా భూ యజమానికి తాజాగా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ పథకం కింద అక్రమంగా పొందిన మొత్తం రూ.16 లక్షలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని అధికారులు సదరు వ్యక్తికి నోటీసులు పంపించారు.
రూ.16 లక్షలు తిరిగి చెల్లించండి…
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘాట్ కేసర్ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన ఎం. యాదగిరి రెడ్డి అనే వ్యక్తికి అదే గ్రామంలో సర్వే నెంబర్ 38,38,40 లో 33 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఆ భూమిని కొన్నేళ్ల క్రితం ప్రైవేట్ డెవలపర్స్ సహకారంతో వ్యవసాయ భూమిలో అక్రమ లే అవుట్ వేశాడు. లే అవుట్ వేసేందుకు కావాల్సిన అనుమతులు లేకుండానే ఆ ప్రక్రియ పూర్తి చేశాడు. తరువాత ఆ ప్లాట్లను అనేక మందికి విక్రయించాడు.
ఇలా ప్రైవేట్ వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూనే......వ్యవసాయేతర భూమికి తప్పుడు పాత్రలు సమర్పించి ప్రభుత్వం నుంచి రైతు బంధు పథకం నిధులను లక్షల్లో పొందారు. గత కొన్నేళ్లుగా ఇది ఇలానే కొనసాగుతుండగా......తాజాగా ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ గౌతంకు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు.
దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు భూ యజమాని యాదగిరి రెడ్డిపై రికవరీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వాస్తవానికి అది వ్యవసాయేతర భూమి అయినప్పటికీ ధరణి భూ రికార్డులో సాగు భూమిగా చూపించడం గమనార్హం. దీంతో పాటు హైదరాబాద్ మెట్రపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ( HMDA) మరియు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కెంట్రి ప్లానింగ్ ( DTCP) అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్ నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. నగర శివారులో ఇదే తరహాలో అనేక మంది అనుమతులు లేకుండా లే అవుట్ నిర్మించడమే కాకుండా, వాటికి రైతు బంధు డబ్బులను కూడా పొందినట్టు అధికారులు నిర్ధారించారు.
ఆచితూచి అడుగులు….
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల వ్యవసాయ భూములు ఉంటే.......66 వేల ఎకరాలకు రైతు బంధు చెల్లింపులు జరిగినట్టు రికార్డులో కలెక్టర్ గుర్తించారు. ఈ మేరకు అక్రమంగా పొందిన రైతుబంధు నిధులను రికవరీ చేసే పనిలో పడ్డారు రెవెన్యూ శాఖ అధికారులు.
ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వం మొత్తం 12 విడతల్లో రైతు బంధు నిధులను జమ చేసింది. అయితే అందులో దాదాపు రూ.25 వేల కోట్ల వ్యవసాయేతర భూములకు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే గత తప్పిదాలు ఇప్పుడు జరగకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
రైతుబంధు భరోసా పథకం లబ్దిదారులను ఎంపిక చేయడంపై ప్రభుత్వం ఆచితూచీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మంత్రులతో కూడిన ఓ కమిటీని నియమించి.....జిల్లాల వారీగా వర్క్ షాపులు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది.