Revanth reddy: కొడంగల్‌కు కృష్ణా జలాలు ఎందుకు రాలేదన్న రేవంత్ రెడ్డి-revanth reddy asked why krishna water did not come to kodangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: కొడంగల్‌కు కృష్ణా జలాలు ఎందుకు రాలేదన్న రేవంత్ రెడ్డి

Revanth reddy: కొడంగల్‌కు కృష్ణా జలాలు ఎందుకు రాలేదన్న రేవంత్ రెడ్డి

Sarath chandra.B HT Telugu
Nov 06, 2023 01:45 PM IST

Revanth reddy: సిరిసిల్ల, సిద్ధిపేటల మీద ఉన్న ప్రేమ కొడంగల్‌ మీద ఎందుకు లేదని సిఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రెండేళ్లలలో కృష్ణా జలాలు తీసుకొస్తామని ఎక్కడికి పోయారు. కొడంగల్‌ ప్రజల్ని కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు.

కొడంగల్‌ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
కొడంగల్‌ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి

Revanth reddy: సిరిసిల్ల, సిద్ధిపేట ప్రజలు చేసుకున్న పుణ్యం ఏమిటి కొడంగల్ చేసిన పాపం ఏమిటని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2009లో మహబూబ్‌నగర్‌ ప్రజలు కేసీఆర్‌ను నమ్మి పార్లమెంటుకు పంపితే వారినే మోసం చేశాడని ఆరోపించారు.

మహబూబ్‌నగర్‌కు తెలంగాణ వచ్చిన పదేళ్లలో కేసీఆర్‌ ఎందుకు న్యాయం చేయలేదన్నారు. ఈ ప్రాంతానికి న్యాయం చేసి ఉంటే కొడంగల్‌లో తేల్చుకోడానికి రమ్మంటే ఎందుకు స్పందించలేదన్నారు. కృష్ణా జలాలు పారించి ఉన్నా, కోస్గిలోమహిళా కాలేజీ, ఇంజీనింగ్ కాలేజీలు కట్టి ఉంటే ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే వారన్నారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు నియోజక వర్గం వచ్చిన రేవంత్‌ సిఎంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు ఇచ్చిన బలంతో కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టానని చెప్పారు. కొడంగల్ సమాజమంతా కూర్చుని ఆలోచన చేయాలని, తెలంగాణ రాజకీయాల్లో ఇంత గొప్ప అవకాశం కొడంగల్ కు వచ్చిందన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనది కాదని కొడంగల్‌లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్ కు అధ్యక్షుడే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు.

కృష్ణా జలాలు, రైల్వే లైన్, జూనియర్, పీజీ కాలేజీలు, కృష్ణా జలాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ గుర్నాధ్ రెడ్డిని నమ్మించారని రేవంత్ ఆరోపించారు. ఐదేళ్లలో కొడంగల్ కు కేసీఆర్ , కేటీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు... అభివృద్ధి జరగలేదన్నారు.

హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆరెస్ సన్నాసులు ఇవాళ ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని ప్ర‌శ్నించారు. అన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కేనా... కొడంగల్ కు ఎందుకు ఇవ్వరన్నారు.

దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరినా రాలేదన్నారు. అభివృద్ధి చేయలేదు కాబట్టే నేను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదన్నారు. తెలంగాణ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు.. కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయని, ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదని ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఎన్నికలన్నారు.

దేశ ముఖ చిత్రంలో కొడంగల్‌కు గుర్తింపు తెచ్చే ఎన్నికలని చెప్పారు. గ్రూపులు, గుంపులు కాదు కొడంగల్ అంతా కలిసి రావాలని కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే మీ జీవితాలు ఆగమైతాయన్నారు.

ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజారిటీతో కొడంగల్ లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. గెలిచిన రెండేళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తి పోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని చెప్పారు. ఏడాదిలో మహబూబ్ నగర్ చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానని, ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకొస్తామన్నారు. అండగా నిలబడే ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత తనదని చెప్పారు. sa

Whats_app_banner