Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో ఎలుకల బెడద..!-rats problem in telangana secretariat arrangement of bones in several rooms ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో ఎలుకల బెడద..!

Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో ఎలుకల బెడద..!

HT Telugu Desk HT Telugu

Telangana Secretariat News: తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయంలో ఎలుకల సంచారం పెరిగిపోయింది. దీంతో అక్కడ పని చేసే అధికారులు… ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. వీటి నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణ సచివాలయంలో ఎలుకల బెడద...!

Rats in Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat)ఎలుకలు సంచరిస్తున్నాయి.చైర్స్, టేబుళ్ళు,సోఫాలు కింద,బీరువాలు, ర్యాక్ లలో ఎలుకలు తిరుగుతున్నాయట...! దీంతో సెక్రటేరియట్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీరువాలో, ర్యాకుల్లో ఉన్న ఫైల్స్ ను అవి ఎక్కడ కొరికి వేస్తాయోనని అధికారులు టెన్షన్ పడుతున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలోకి ఎలుకలు ఎలా వస్తున్నాయో అర్థం గాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే వాటిని నివారించేందుకు పలు క్యాబిన్ లలో,గదుల్లో ఎలుకల బోన్ తో పాటు వాటిని చంపే మందును ఏర్పాటు చేశారు.బయటకు మాత్రం అద్దాల మేడలా ఆకట్టుకునే విధంగా ఉన్న.....లోపల మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఇరుకైన గదులు,కొన్ని గదుల్లో వెంటిలేషన్ సమస్య,ఫైల్స్ ను భధ్రపరిచేందుకు సరిపడా ర్యాక్స్ లెకోవడం వంటి సమస్యలు ఉన్నాయని సెక్రటేరియట్ సిబ్బంది అంటున్నారు.

ఎటు చూసినా ఎలుకలే ఉన్నాయి....

" ఎటు చూసినా ఎలుకలే కనిపిస్తున్నాయి.ఫైళ్లను కోరుకుతాయని భయంగా ఉంది. కొత్తగా ర్యాక్స్ ఇవ్వడం లేదు. బీఆర్కే భవన్ నుంచి తెచ్చుకున్న బీరువాలోనే ఫైళ్ళను పెడుతున్నాం. అందులోకి కూడా ఎలుకలు దూరుతున్నాయి " అని జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారి ఒకరు సెక్రటేరియట్ పరిస్థితులను వివరించారు.

" మా ఛాంబర్ లో ఉదయం నుంచి మేం తిరిగి ఇంటికి వెళ్ళెంత వరకు ఎలుకలు అటు ఇటు తిరుగుతూ....చాలా సార్లు మా కాళ్ళ మధ్య నుంచి కూడా పోతుంటాయి. అవి ఎక్కడ కరుస్తాయో అని భయంగా ఉంటుంది " అని ఓ లేడీ సెక్షన్ ఆఫీసర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. వీటి బెడతను తగ్గించేందుకు కొందరు ఉద్యోగులు తమ సొంత డబ్బుతో ఎలుకల బోన్లను తెచ్చుకొని తమ గదుల్లో,తమ ఛాంబర్ లో పెట్టుకున్నారట…!

 "ప్రతి రోజూ అయిదారు ఎలుకలు బోనులో పడుతున్నాయి. ఈ సమస్య పైన ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా GAD వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు " అంటూ సెక్రటేరియట్ మూడో అంతస్తులో పని చేసే ఓ అటెండేర్ వివరించారు.  అద్దాల మేడ లాంటి కొత్త భవనంలోకి ఈ ఎలుకలు ఎలా వస్తున్నాయో అసలు అర్థం కావడం లేదని సెక్రటేరియట్ హౌస్ కీపింగ్ సిబ్బంది చెబుతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి.....

గత ఏడాది ఏప్రిల్ 30 తేదీన తెలంగాణ నూతన సచివాలయాన్ని(Telangana Secretariat) అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ భవనం నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే సెక్రటేరియట్ నిర్మాణం మాత్రం ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. గ్లోబ్ కింద నిర్మించిన 10,11,12 అంతస్తులో పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దీంతో పాటు సచివాలయం బయట నిర్మించిన క్యాంటీన్ లో కిచెన్ నిర్మాణ పనులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎలుకుల బెడద సమస్య పై పలు మార్లు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు వివరించినా.....నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. ఇలా ఉంటే తమ విధులకు ఆటంకం కలుగుతుందని,తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సెక్రటేరియట్ లో పని చేసే ఉద్యోగులు,ఇతర సిబ్బంది వేసుకుంటున్నారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.