Rakesh Reddy: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బరిలో రాకేశ్​ రెడ్డి! ఉప ఎన్నిక కోసం మళ్లీ తెరపైకి..-rakesh reddy back to the screen for the by election for graduate mlc election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rakesh Reddy: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బరిలో రాకేశ్​ రెడ్డి! ఉప ఎన్నిక కోసం మళ్లీ తెరపైకి..

Rakesh Reddy: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బరిలో రాకేశ్​ రెడ్డి! ఉప ఎన్నిక కోసం మళ్లీ తెరపైకి..

HT Telugu Desk HT Telugu
Feb 07, 2024 06:04 AM IST

Rakesh Reddy: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ graduate mlc ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి ఆ పార్టీ నేత ఏనుగుల రాకేశ్​ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రాకేష్ రెడ్డి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రాకేష్ రెడ్డి

Rakesh Reddy: అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో కొనసాగిన ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్​ ఆశించగా.. ఆ పార్టీ అధిష్ఠానం నుంచి రాకేశ్​ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో బీఆర్​ఎస్​ brs పార్టీలో చేరిన ఆయన.. ఎమ్మెల్సీ పదవి హామీతోనే గులాబీ కండువా కప్పుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ graduate mlc స్థానాన్ని ఆయనకే కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది.

yearly horoscope entry point

బీఆర్​ఎస్‌లో చేరి తెరమరుగు

ప్రతిష్టాత్మక బిట్స్​ పిలానీ యూనివర్సిటీలో చదివిన పేరు, అక్కడ స్టూడెంట్​ లీడర్​ గా ఎదిగిన తీరు, టీవీ డిబేట్​లు, పదునైనా మాటలతో ఏనుగుల రాకేశ్​ రెడ్డి రాజకీయంగా తనపేరు ప్రజలకు తెలిసేలా చేశారు.

మొదట్నుంచీ బీజేపీలోనే పని చేసిన ఆయన ఆ పార్టీ భావజాలంతోనే జనాలకు సుపరిచితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ టికెట్​ పై ఆశలు పెట్టుకున్న రాకేశ్​ రెడ్డి.. చివరకు ఆ టికెట్ మహిళా కోటాలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న రావు పద్మారెడ్డికి దక్కడంతో ఆయన నిరాశకు గురయ్యారు.

ఆ తరువాత పార్టీ కోసం కష్టపడుతున్నా అధిష్టానం నుంచి సరైన గుర్తించి లభించని కారణంగా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీ నుంచి తన క్యాడర్​ తో కలిసి వైదొలిగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దలకు కూడా సంకేతాలు ఇచ్చినా.. పట్టించుకోకపోవడంతో రాకేశ్​ రెడ్డి తీవ్ర వేదనకు గురై బీజేపీ నుంచి తప్పుకున్నారు.

ఆ తరువాత అప్పటి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్​ రెడ్డి, కడియం శ్రీహరి ప్రోద్బలంతో అప్పటి మంత్రి కేటీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ ఓటమిని మూటగట్టుకోగా.. అప్పటి నుంచి రాకేశ్​ రెడ్డి కూడా ఎక్కడా యాక్టివ్​ గా కనిపించిన దాఖలాలు లేవు.

గ్రాడ్యుయేట్​ ఎన్నికలతో రీ ఎంట్రీ

వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీగా 2021లో ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

వాస్తవానికి 2027 మార్చి 29వరకు పదవీ కాలం ఉండటంతో గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌కు ఎన్నికల నిర్వహణపై ఆదేశాలిచ్చింది. తొలి దశలో ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇదిలాఉంటే రాకేశ్​ రెడ్డి బీఆర్​ఎస్​ లో చేరే క్రమంలోనే ఎమ్మెల్సీ పదవి హామీతోనే గులాబీ కండువా కప్పుకుంటున్నారనే ప్రచారం జరిగింది.

పల్లా రాజేశ్వర్​ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరూ స్పష్టంగా అదే హామీ ఇచ్చి రాకేశ్​ రెడ్డిని పార్టీకి తీసుకెళ్లారనే ఆరోపణలున్నాయి. కాగా ఇప్పుడు గ్రాడ్యుయేట్​ ఎన్నికలకు కసరత్తు జరుగుతుండటంతో ఇన్నిరోజులు తెరమరుగునే ఉన్న రాకేశ్​ రెడ్డి పేరు.. మళ్లీ తెరమీదకు వచ్చింది. ఉన్నతంగా చదివిన వ్యక్తి కావడంతోపాటు స్థానిక సమస్యలు తెలిసి ఉన్న నేత కావడం, విద్యారంగంపై పట్టున్న నేపథ్యంలో ఆయనను గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

పట్టుబడుతున్న ఇద్దరు లీడర్లు!

రాకేశ్​ రెడ్డిని బీఆర్​ఎస్​ పార్టీలో చేర్చుకునే సమయంలో పల్లా రాజేశ్వర్​ రెడ్డి, కడియం శ్రీహరి హామీ ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరూ కూడా గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానాన్ని రాకేశ్​ రెడ్డికే కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల మళ్లీ తెరమీదకు వచ్చిన రాకేశ్​ రెడ్డి చదువుకున్న యువతతో ఇంటరాక్ట్​ అయ్యే ప్రయత్నాల్లో పడ్డారు.

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పట్టభద్రులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సోషల్ మీడియా వేదికన విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. తన క్యాడర్​ తో పట్టభద్రులకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం ఫిబ్రవరి 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉండగా.. ఏప్రిల్ 4 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటించడంతోపాటు జూన్‌ 8 నాటికి ఉప ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.

ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, ఎమ్మెల్సీ స్థానాలపైనా కన్నేయగా.. బీఆర్​ఎస్​ పార్టీ కూడా టికెట్ల కేటాయింపులో తీవ్ర కసరత్తు చేస్తోంది. మరి వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానాన్ని ఆ ఇద్దరు నేతలు పట్టుబడుతున్నట్టుగా రాకేశ్​ రెడ్డికే కేటాయిస్తుందో.. లేదా మరెవరికైనా అవకాశం ఇస్తుందో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner