Rajendranagar Suicides: అక్రమ సంబంధమే కారణం.. వీడిన జంట ఆత్మహత్యల మిస్టరీ
Rajendranagar Suicides: రాజేంద్రనగర్ జంట ఆత్మహత్యల మిస్టరీ వీడింది. అక్కా తమ్ముళ్ల వరుసైన జంట ఆత్మహత్య వెనుక కారణాలను పోలీసులు బయట పెట్టారు.
Rajendranagar Suicides: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న జంట మరణాలకు కారణాలను పోలీసులు కనిపెట్టారు. గత వారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మకొండకాలనీలో ఈనెల 23న అక్కా తమ్ముళ్ల వరుసైన జంట ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
స్రవంతి అలియాస్ చామంతి, శేఖర్ గౌడ్‌ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు పొరుగూరు వెళ్లిన సమయంలో చామంతి ఇంట్లోనే ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నరసింహ గౌడ్ ,సోమేష్ గౌడ్ అన్నదమ్ములు. 12 ఏళ్ల క్రితం బ్రతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చారు.
రాజేంద్రనగర్ సర్కిల్ లోని హైదర్ గూడా కేశవ్ నగర్ లోని సొంత ఇల్లు కట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. భవనం పై అంతస్తులో నరసింహ, స్వప్న దంపతులు, తమ ఇద్దరు కుమారులతో పాటు నరసింహ మేనమామ కుమారుడు.. స్వప్న సోదరుడైన శేఖర్‌తో కలిసి నివాసం ఉంటున్నారు.
కింది అంతస్తులో సోమేశ్ అతని భార్య స్రవంతి అలియాస్ చామంతి (28) ఇద్దరి కుమారులతో కలిసి ఉంటున్నారు. నరసింహ, సోమేశ్ అన్నదమ్ములు ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేస్తుండగా మృతుడు శేఖర్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మృతురాలు చామంతి స్థానికంగా ఇళ్లలో పనిచేసేది.
ఈ నెల 23వ తేదీన స్వగ్రామంలో బంధువు దశ దినకర్మ ఉండడంతో నరసింహ, సోమేశ్ తో పాటు స్వప్న వెళ్లారు. ఉదయం పిల్లలను స్కూల్లో వదిలి వెళ్లి వచ్చిన సోమేశ్ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది.
మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి చెందు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. గది లోపలకి వెళ్లి చూడగా తల్లి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. భయంతో పిల్లలు వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో విషయం చెప్పారు. వారు భర్త సోమేశ్ తో పాటు పోలీసులకు సమాచారం అందించారు.
వివాహం ఖాయం కావడంతోనే…
భర్త మేనమామ కుమారుడైన శేఖర్‌తో చామంతి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసు విచారణలో గుర్తించారు. వారిద్దరి సెల్‌ఫోన్లను పరిశీలించిన పోలీసులు ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
స్రవంతి నిత్యం ఐదారుసార్లు శేఖర్ గౌడ్‌తో సంభాషించేది. ఇద్దరు తమ ఫొటో లను ఒకరికొకరు పంపుకోవడం, వాటికి కామెంట్లు పెట్టుకోవడం చేస్తున్నట్లు గుర్తించారు.
శేఖర్ గౌడ్‌కు ఇటీవల పెళ్లి సంబంధాలు చూశారు. వివాహమై వెళ్లిపోతే తనకు దూరం అవుతాడని చామంతికి బెంగ పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 23న కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇద్దరు మాట్లాడుకున్నారు.
మొదట చామంతి ఆత్మహత్య చేసుకోగా భయపడిన శేఖర్‌గౌడ్ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇద్దరు ఉరేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో చామంతి పిల్లలు తల్లి లేని వారయ్యారు. మరోవైపు కుమారుడు పోయిన దుఃఖంతో శేఖర్ గౌడ్ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.