TS Weather : చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్ లో భారీ వర్షం - ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరి-rain forecast for next five days across telangana ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Rain Forecast For Next Five Days Across Telangana

TS Weather : చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్ లో భారీ వర్షం - ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరి

HT Telugu Desk HT Telugu
Jun 04, 2023 03:29 PM IST

Weather Updates Of Telugu States: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇక మరో ఐదు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

Rains in Telangana: గత రెండు మూడు రోజులుగా తెలంగాణలో వాతావరణం మారుతోంది. ఓవైపు ఎండలు మండిపోతూనే..మరోవైపు వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా… ఇవాళ పలుచోట్ల వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడగా… మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున నగర శివార్లలో తేలికపాటి వర్షం పడింది, దుండిగల్‌, బహదూర్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత మాదాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, గాజులరామారం, కూకట్‌పల్లి, చింతల్‌, బాలానగర్‌, నార్సింగి, కోకాపేట్‌, కొండాపూర్‌, అల్వాల్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, లింగంపల్లి, నిజాంపేటపలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

ట్రెండింగ్ వార్తలు

ఇదిలా ఉంటే తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రానున్న నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దక్షిణ చత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఫలితంగా చాలాచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబాబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిచింది. గంటకు 30- 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఇక రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. జూన్ 9తేదీ వరకు పలుచోట్ల వర్షాలు పడుతాయని తెలిపింది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం అల్లూరి జిల్లాలోని చింతూరు, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు తీవ్రవడగాల్పులు, 135 మండలాల్లో వడగాల్పులు, రేపు(సోమవారం) 8 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 268 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించింది. శనివారం పల్నాడు జిల్లా రావిపాడు 45.6°C, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పుగోదావరి జిల్లా పేరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పేదమేరంగిలో 45.5°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు.

-విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

-కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

-శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C - 41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

WhatsApp channel