Ap Ts Weather Updates: ఏపీలో మండనున్న ఎండలు.. తెలంగాణలో వానలు పడే అవకాశం
Ap Ts Weather Updates: రోహిణి కార్తెలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నా, నేటి నుంచి వాటి తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో తేలిక పాటి వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు.
Ap Ts Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఎండలు మండిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 84 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు మరో 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
నేడు అనకాపల్లి 1మండలం, బాపట్లలో 6మండలాలు, తూర్పుగోదావరిలో 5, ఏలూరులో 4, గుంటూరులో 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కాకినాడలో 11, కోనసీమ 1 మండలంలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ వాఖ తెలిపింది. కృష్ణాలో 13, ఎన్టీఆర్‌లో 15 మండలాల్లో వడగాలులు వీస్తాయి. పల్నాడు జిల్లాలోని 11 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
శుక్రవారం అల్లూరి , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
కృష్ణా జిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గురువారం 44.5°Cలు నమోదు అయ్యాయి. తిరుపతి జిల్లా గూడూరులో 44.4°Cలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44.3°Cలు నమోదు అయ్యాయి.
తెలంగాణలో వానలు…
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. హైదరాబాద్‌లోనూ గురువారం సాయంత్రం లేదా రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ ఉండొచ్చని పేర్కొంది.
మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతు పవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు దీని వల్ల మొదట ప్రకటించిన అంచనాలు తప్పనున్నాయి. తాజా అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 80.4 సెం.మీల వర్షపాతం నమోదు కానుందని ది వెదర్ కంపెనీ వెల్లడించింది.
ఎల్‌నినో ప్రభావం జూన్‌లో వచ్చే నైరుతి పవనాలపై పూర్తి సీజనంతా ఉండనుందని ఆ సంస్థ తెలిపింది. ఉష్ణ మండల పవనాలు భారత్‌లో వీచడం వల్ల జూన్ ప్రథమార్థంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నాయి.