Railway rake point: మెదక్ లో రైల్వే రేక్ పాయింట్ ప్రారంభం-railway rake point starts in medak ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Railway Rake Point Starts In Medak

Railway rake point: మెదక్ లో రైల్వే రేక్ పాయింట్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Aug 01, 2022 04:12 PM IST

Railway rake point: మెదక్ రైల్వే రేక్ పాయింట్ తో దశాబ్దాల కల నిజం అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యం అయిందన్నారు. అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు.

మెదక్ రైల్వే రేక్ పాయింట్
మెదక్ రైల్వే రేక్ పాయింట్

Railway rake point: మెదక్ రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ఈ రైలు వచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. త్వరగా రైలు రావాలని మన వాటా కట్టి ఏర్పాటు చేశామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

'ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సనత్ నగర్ గోడౌన్ కి పంపుతున్నాం. ఇప్పుడు ఇక్కడే స్టాక్ చేసి దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపుతాం. మెదక్ ఎంతో అభివృద్ధి చెందింది. మెదక్ జిల్లా ప్రజల చిరకాల కల సాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది. సింగూర్ జలాలు మెదక్ కు దక్కాలని నినాదం ఉండే.. అది నిజం చేశాం. కొందరు ఉప ఎన్నిక అంటున్నారు. ఎందుకు ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా. మేం తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశాం. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టాలని త్యాగాలు చేశాం. దిల్లీ దాకా తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు త్యాగాలు చేశాం.' అని హరీశ్ రావు అన్నారు.

ఉపాధి హామీ కూలీలు రోజుకు రెండు సార్లు అటెండెన్స్ ఇవ్వాలా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. పథకం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉచితాలు వద్దని ప్రధాని మోదీ చెబుతున్నారు.. అంటే రైతు బంధు వద్దా, కరెంట్ వద్దా, కల్యాణ లక్ష్మి వద్దా అని ప్రశ్నించారు. పేదలు, రైతుల గురించి ఏనాడైనా ఆలోచన చేశారా అని అడిగారు. వరంగల్ కు రైల్వై కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వరంట అని పేర్కొన్నారు. కాని ఉపఎన్నిక మాత్రం తెస్తరట అని ఎద్దేవా చేశారు. మీరు తెస్తామంటున్న ఉపఎన్నికతో తెలంగాణకు ఏ లాభం అని అడిగారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. దశాబ్దాల కాలం పాటు ఎదురు చూసిన మంచి ఘడియ ఇది అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ రేక్ పాయింట్ కోసం కృషి చేసిందని చెప్పారు. ఆలస్యంగా అయినా మంచి పని జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్యాసింజర్ రైలు వస్తుందని చెప్పారు. ఆలస్యం లేకుండా రైతుల వ్యవసాయ ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా చేర వేసేందుకు ఉపయోగపడుతుందని నిరంజన్ రెడ్డి అన్నారు.

'తెలంగాణ వ్యవసాయ రంగం ఏడేళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడి రైతు అనుకూల విధానాలు దేశంలో ఎక్కడా లేవు. గుజరాత్ లో ఉచిత కరెంట్ లేదు. రైతు పెట్టుబడి సాయం లేదు. రైతు బీమా లేదు. సాగు నీరు లేదు. తెలంగాణలోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పథకాలు మా వద్ద అమలు చేయాలని ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడి ప్రభుత్వాలను అడుగుతున్నారు. బీజేపీ స్వాతంత్రోద్యమంలో లేదు.. వారు చెబితేనే వజ్రోత్సవ వేడుకలు చేసుకుంటామా? మనం చేస్తాం. మనకు చిత్త శుద్ధి ఉంది.' అని నిరంజన్ రెడ్డి అన్నారు.

IPL_Entry_Point