Phone Tapping Case : కరీంనగర్ కు రాధాకిషన్ రావు తరలింపు - కారణం ఇదే..!
Phone Tapping Case Latest Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలులో ఉన్న రాధా కిషన్ రావును పోలీసులు కరీంనగర్ కు తీసుకొచ్చారు.కోర్టు అనుమతితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించారు.
Phone Tapping Case Latest Updates: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) ఏ4 నిందితుడిగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న టాస్క్ఫోర్స్ రిటైర్డ్ డిసిపి రాదాకిషన్ రావు(Radhakishan Rao) ను కట్టుదిట్టమైన భద్రత మద్య కరీంనగర్ కు తరలించారు. పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్న రాధాకిషన్ తల్లి సరోజినీ దేవి(98)ని చూసేందుకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో భారీ బందోబస్తు మధ్య చంచల్ గూడ జైల్ నుంచి కరీంనగర్ లోని సాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కోర్టు అనుమతితో తల్లిని పరామర్శించిన రాదాకిషన్ రావు కుటుంబ సభ్యులను కలిసి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సోదరి సంరక్షణలో ఉన్న తల్లిని చూసి భావోద్వేగానికి గురైన రాదాకిషన్ ను కుటుంబ సభ్యులు ఓదార్చారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆసుపత్రిలో ఉన్న రాదాకిషన్ ను గట్టి భద్రత మద్య మళ్ళీ జైల్ కు తరలించారు.
రక్షణ కల్పించాల్సిన అధికారికే రక్షణ…
మొన్నటి వరకు ఓఎన్డీగా పనిచేసిన రాధాకిషన్ రావు చుట్టూ రక్షణ వలయం అధికారికంగా ఉండేది. దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం రిటైర్ అయిన రాధాకిషన్ రావు స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఆయనకు ప్రభుత్వం ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. గత సంవత్సరం పీరియడ్ ముగియడంతో మళ్లీ ఎక్స్ టెన్షన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాధాకిషన్ రావుపై ఈసీఐకి ఫిర్యాదులు వెల్లడంతో ఆయనను విధుల నుండి తప్పించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాధాకిషన్ రావు తన బాద్యతలకు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసిన రక్షణ వలయంలోనే ఉన్నారు. కానీ ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంపై విచారణ చేయిస్తుండడంతో ఆయన ఓ నిందితుడయ్యారు. ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కేసు విచారణలో పలువురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా అందులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ఒకరు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆరు నెలల క్రితం వరకు పోలీసు అధికారిగా ఆయనకు రక్షణ కల్పిస్తే ఇప్పుడు మాత్రం నిందితునిగా రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఆరు నెలల కాలంలోనే ఎంత మార్పు వచ్చిందోనని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఒకప్పటి పోలీస్ ఆఫీసర్ చివరకు పోలీసుల రక్షణ మద్య కోర్టు అనుమతితో తల్లిని చూసుకునే దుస్థితి ఏర్పడింది.
పోలీస్ ఎస్కార్ట్ ఖర్చు భరించిన రాధాకిషన్…
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) లో ఏ4 నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న రిటైర్డ్ డిసిపి రాధాకిషన్ రావును తల్లిని చూసేందుకు షరుతులతో కూడిన అనుమతి కోర్టు ఇచ్చింది. రాదా కిషన్ ను చంచల్ గూడ జైలు నుంచి కరీంనగర్ కు తరలించేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ఎస్కార్ట్ వాహనాలకు అవసరమైన ఖర్చులు ఆయనే భరించాలని కోర్టు ఆదేశించింది. అందుకు అయ్యే రూ.18 వేలు ఆయన చెల్లించాలని ఆదేశించడంతో తల్లిని చూసేందుకు రాధాకిషన్ రావు ఆ మొత్తాన్ని చెల్లించారు.
రిపోర్టింగ్ - HT తెలుగు Correspondent K.V.REDDY, Karimnagar
సంబంధిత కథనం