TG college Holidays : దసరా తర్వాత డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్.. కారణం ఏంటో తెలుసా?-private degree and pg colleges in telangana to shut indefinitely after dussehra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg College Holidays : దసరా తర్వాత డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్.. కారణం ఏంటో తెలుసా?

TG college Holidays : దసరా తర్వాత డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్.. కారణం ఏంటో తెలుసా?

Basani Shiva Kumar HT Telugu
Oct 10, 2024 11:55 AM IST

TG college Holidays : తెలంగాణలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కనీసం భవనాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ను విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ

ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయని కారణంగా.. తెలంగాణలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలను దసరా తర్వాత నిరవధికంగా బంద్ చేయనున్నారు. ఈ మేరకు కళాశాలల యాజమాన్య అసోషియేషన్ నిర్ణయం తీసుకుంది. ఓయూ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ లక్ష్మీనారాయణకు బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 

అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహాయాదవ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో.. కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నరసింహాయాదవ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కోసం.. ప్రతి సంవత్సరం రూ.2,500 కోట్లు కేటాయిస్తోంది, అందులో 40 శాతం అంటే రూ.1,000 కోట్లు నాన్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ల విద్యార్థులకు కేటాయిస్తోంది. గత మూడు విద్యా సంవత్సరాల్లో మొత్తం రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు చెబుతున్నారు.

రూ.800 కోట్లకు టోకెన్లు జారీ చేసినట్లు కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఆ మొత్తం విడుదల కాకపోవడంతో.. ప్రైవేట్ కళాశాలలు భవన అద్దె, సిబ్బంది జీతాలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నిలదొక్కుకునేందుకు పలు కళాశాలలు రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకు అప్పు తీసుకున్నాయని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల నిర్వాహకులు సమైక్య నిరసన చేస్తున్నారు. గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 900 కళాశాలల నిర్వాహకులు జూన్ నెలలో ఇందిరాపార్క్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయి పడిందని.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 2024 జులై 14న వ్యాఖ్యానించారు. ఆ బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాలేజీల యాజమాన్య ప్రతినిధులందరూ కలిసి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ప్రతిపాదనలు ఇస్తే.. సమస్యను త్వరగా పరిష్కరించే బాధ్యతను ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగిస్తున్నానని స్పష్టం చేశారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి పడకుండా సకాలంలో ఫీజు చెల్లింపులు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడి బిడ్డకు కార్పొరేట్‌ విద్యను అందించాలనే ఉద్దేశంతో.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Whats_app_banner