BJP Telangana: ఇక తెలంగాణపై స్పెషల్ ఫోకస్.. ఈ నెలలోనే మోదీ, అమిత్ షా, నడ్డా టూర్!-pm modi and amit shah jp nadda to visit telangana to highlight development initiatives of union govt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Pm Modi And Amit Shah Jp Nadda To Visit Telangana To Highlight Development Initiatives Of Union Govt

BJP Telangana: ఇక తెలంగాణపై స్పెషల్ ఫోకస్.. ఈ నెలలోనే మోదీ, అమిత్ షా, నడ్డా టూర్!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 07, 2023 12:40 PM IST

Modi - Amith Sha Telangana Tour:బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇప్పటికే అమిత్ షా, నడ్డా షెడ్యూల్ ఖరారు కాగా.. తాజాగా ప్రధానమంత్రి మోదీ పర్యటనపై కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీ - అమిత్ షా
ప్రధాని మోదీ - అమిత్ షా

BJP Telangana Latest News: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. మొన్నటి వరకు దూకుడు మీద కనిపించిన బీజేపీ.... ఇప్పుడు డీలా పడినట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్... తెగ స్పీడ్ పెంచేసింది. కీలక నేతలను తమ వైపు తిప్పుకునే పనిలో పడిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా.... జనాల్లోకి వెళుతున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... అన్ని పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకోవటంతో పాటు ప్రత్యర్థిని బోల్తా కొట్టించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ అధినాయకత్వం.

కర్ణాటక ఎన్నికలతో డీలా పడిన తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్ నింపేలా కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది. తెలంగాణలో పట్టు బిగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కాషాయదళం ప్రణాళికలు చేస్తోంది. కాంగ్రెస్ రోజురోజుకూ బలపడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో... ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో... అగ్రనేతలు రంగంలోకి దిగినున్నట్లు తెలుస్తోంది. జూన్ నెలలోనే ఏకంగా ముగ్గురు అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా, జేపీ నడ్డా టూర్ షెడ్యూల్ ఖరారు కాగా... ప్రధాని మోదీ పర్యటనపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఒకే నెలలో ముగ్గురు అగ్రనేతలు రానున్న క్రమంలో.... రాష్ట్ర నాయకత్వం కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేసే పనిలో ఉంది.

మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో అమిత్‌ షా తో పాటు నడ్డా కూడా హాజరుకానున్నారు. ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జరిగే సభకు అమిత్ షా హాజరవుతారు. ఇక జూన్ 25వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జరిగే బీజేపీ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల ఏపీ పర్యటన కూడా ఇప్పటికే ఖరారు అయింది. మరోవైపు మహాజన్ సంపర్క్ అభియాన్​లో భాగంగా తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వస్తారని తెలుస్తోంది. ఈ నెలలో మల్కాజిగిరి పార్లమెంట్ లో నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొంటారని సమాచారం. కర్ణాటక తరహాలో హైదరాబాద్​లో మోదీ రోడ్ షో ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో భారీ సభను కూడా తలపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై రేపోమాపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మహాజన్ ‌సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే పనిలో పడింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసేందుకు కేడర్‌కు దిశానిర్దేశం చేసింది. చేయాల్సిన కార్యక్రమాలపై సునీల్ బన్సల్ సమీక్ష కూడా చేపట్టారు. అగ్ర నేతల పర్యటనల నేపథ్యంలో పలు అంశాలపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల సమీపిస్తున్న వేళ ముగ్గురు అగ్రనేతలు రాష్ట్రానికి వస్తుండటంతో... రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

IPL_Entry_Point