Peddapur : పెద్దాపూర్ బాధిత కుటుంబాలకు మంత్రుల పరామర్శ- రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ప్రకటన
Peddapur Welfare Hostel : పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 15 రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Peddapur Welfare Hostel : గత ప్రభుత్వం పదేళ్లలో విద్య కోసం రూ.830 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఐదు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఐదు వేల కోట్లతో భవనాలు లేని పాఠశాలలకు శాశ్వత భవనాలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆవరణలో ఔషద మొక్కలు, పండ్ల మొక్కలు నాటి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు సంక్షేమ హాస్టల్ లో కుటుంబంలో ఒకరి ఉద్యోగం, ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఘనాదిత్యా, అనిరుధ్ మృతి చెందడంతో ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు చెత్తాచెదారం, పురాతన షెడ్స్ ఉండడంతో వాటిని తొలగించి పరిస్థితులను మెరుగుపరిచేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డార్మెంటరీ, పై అంతస్తు కోసం ప్రతిపాదనలు వెంటనే పంపిస్తే ఆలస్యం లేకుండా నిధులు మంజూరు చేస్తామని, నిధులకు ఇబ్బంది లేదన్నారు.
భట్టిని పట్టుకుని బోరున విలపించిన పేరెంట్స్
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మృతి చెందిన ఘనాదిత్య, అనిరుధ్ కుటుంబాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. భట్టిని పట్టుకుని పేరెంట్స్ బోరున విలపించారు. మృతుల కుటుంబాలను భట్టి ఓదార్చి జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం... తెలిసిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడాం...గురుకులం సందర్శించి ఏం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. అమెరికాలో ఉన్న సీఎం కూడా పెద్దాపూర్ ఘటనపై నాతో మాట్లాడారని ఎప్పటికప్పుడు సమస్యను తెలుసుకున్నామని చెప్పారు. ప్రాణం పోయినా పిల్లలను తీసుకురాలేం కానీ, ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమస్యలపై ఏకరువు పెట్టిన విద్యార్థులు పేరెంట్స్
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు పేరెంట్స్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటరాక్షన్ అయ్యారు. విద్యార్థులు పేరెంట్స్ సమస్యలపై ఏకరువు పెట్టి, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్న పట్టించుకునేవారు లేరన్నారు. చచ్చాక వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీమ కుడితే పిల్లలు పడిపోతారా? అని ప్రశ్నించారు. అధికారులు అబద్ధాలు ఆడుతున్నారని, చచ్చాక ఫోన్ చేసి సీరియస్ గా ఉన్నారని చెబుతారని తెలిపారు. మా స్నేహితుడికి జ్వరం వచ్చిందని చెప్పిన పట్టించుకోలేదని ఓ విద్యార్థి భట్టికి ఫిర్యాదు చేశారు. ఎవరు పట్టించుకోకపోవడంతో దుప్పటి కప్పుకుని పడుకుని కన్ను మూశాడని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులంలో సీటు వచ్చిందనే ఆనందం కంటే భయం ఎక్కువగా ఉందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాపూర్ గురుకులం చరిత్ర కలదని.. హాస్టల్ సమస్యలను పరిశీలించి విద్యార్థులకు, పేరెంట్స్ దైర్యం ఇవ్వడానికి పెద్దాపూర్ గురుకులం సందర్శించామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్రం తెచ్చుకుందే సంపద పంచేందుకు...భట్టి విక్రమార్క
తల్లిదండ్రుల ఆవేదన మాకు తెలుసు...ప్రజల ప్రభుత్వం..ప్రజా ప్రభుత్వం.. ప్రజలకు ఏం కావాలో వెంటనే స్పందించే సీఎం మంత్రి వర్గం ఉందన్నారు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది..సంపదనను ప్రజలకు పంచడానికి కానీ గత ప్రభుత్వం పదేళ్లలో విద్య కోసం 2014 నుంచి 2023 వరకు రూ.830 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక రూ.5 వేల కోట్లు ఒక్క సంవత్సరంలోనే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కి ఇప్పుడే పునాదులు పడుతున్నాయని తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు... ఎస్సీ ఎస్టీ లకు అదనంగా మరో లక్ష ఇవ్వనున్నామని చెప్పారు.
ప్రతి గురుకుల పాఠశాల పరిస్థితులను మెరుగుపర్చడంతోపాటు పార మెడికల్ సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. పాము కాటు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచుతామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్ట్ పెంచేందుకు కమిటీ వేస్తున్నామని తెలిపారు. డ్రెస్ మెటీరియల్స్.. శానిటేషన్ సామాగ్రి సక్రమంగా అందేలా చూస్తామని చెప్పారు. ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, కలెక్టర్ డీఎం అండ్ హెచ్వో నెలకొకసారి సంక్షేమ హాస్టళ్లను విజిట్ చేసి పిల్లలతో కలిసి భోజనం చేసి వారి బాగోగులను తెలుసుకోవాలన్నారు. పెద్దాపూర్ విద్యార్థుల మృతిపై రహస్యం లేదు... పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా వాస్తవం ఏంటో తెలుస్తుందన్నారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం