Jagtial District : 2 వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి, నలుగురికి అస్వస్థత! పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతోంది..?-suspicious death of students in peddapur gurukulam in jagtial district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial District : 2 వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి, నలుగురికి అస్వస్థత! పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతోంది..?

Jagtial District : 2 వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి, నలుగురికి అస్వస్థత! పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతోంది..?

HT Telugu Desk HT Telugu
Aug 10, 2024 07:12 AM IST

Jagtial District News : జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందగా… నలుగురు అస్వస్థతకు గురయ్యారు.

పెద్దాపూర్ గురుకులంలో స్టూడెంట్స్ అనుమానాస్పద మృతి
పెద్దాపూర్ గురుకులంలో స్టూడెంట్స్ అనుమానాస్పద మృతి

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతి కలకలం సృష్టిస్తుంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. విద్యార్థుల అస్వస్థత, మృతిపై స్పష్టమైన కారణాలు తెలియక విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులను స్వగ్రామాలకు తీసుకువెళ్ళడంతో హాస్టల్ ఖాళీ అవుతుంది.

పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు ఏమైందో తెలియడం లేదు. కడుపునొప్పి అంటు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోతున్నారు. పదిరోజుల క్రితం 8వ తరగతి విద్యార్థి రాజారపు ఘనాధిత్య అస్వస్థతకు గురి కాక ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో కోలుకున్నారు. 

అది మరిచిపోక ముందే తాజాగా శుక్రవారం ఉదయం మరో ముగ్గురు విద్యార్థులు కడుపునొప్పి అంటు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అనిరుద్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతనిది స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట. మరో ఇద్దరు విద్యార్థులు హేమంత్ మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో, మొండి మోక్షిత్ నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని, అనారోగ్యానికి కారణం మాత్రం తెలియడం లేదని వైద్యులు తెలిపారు. విద్యార్థుల రక్త నమూనాలను ల్యాబ్ పంపించామని రిపోర్ట్ వస్తే గానీ ఏమైందో తెలియదని చెప్పారు.

స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత, ఇద్దరు మృతి పై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీశారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. 

విద్యార్థులు కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కోల్పోవడం విచిత్రంగా ఉందన్నారు. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించిన విద్యార్థికి దారిలో ఆర్మూర్ ఆసుపత్రిలో పాముకాటు ఇంజెక్షన్ ఇప్పించామని పాముకాటుతోనే అలా అయి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. పాఠశాల యాజమాన్యం, టీచర్లు నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. అసలు పిల్లలకు ఏమైందో కూడా చెప్పలేని స్థితిలో అక్కడి టీచర్లు సిబ్బంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ లో ఎలుకలు, పాములు, బయట కుక్కలు ఇలా ఉంటే పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సస్పెండ్ చేసినా మారని పరిస్థితి…

10 రోజుల క్రితం విద్యార్థి అస్వస్థకు గురై ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోవడంతో ఫిట్స్ వచ్చి చనిపోయాడని ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులకు ఆయన వివరణ విరుద్ధంగా ఉండడంతో వెంటనే కలెక్టర్ హాస్టల్ ను సందర్శించి ప్రిన్సిపల్ విద్యాసాగర్ ను సస్పెండ్ చేశారు. 

ఇన్ చార్జి ప్రిన్సిపల్ గా మహేందర్ రెడ్డిని నియమించారు. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. వరుసగా విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గురుకుల పాఠశాలలో పిల్లలకు రక్షణ లేదని భావిస్తూ పేరెంట్స్ తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తుండడంతో హాస్టల్ ఖాళీ అవుతుంది. హాస్టల్ పరిస్థితి పై అధికారులు సీరియస్ గా స్పందించి విచారణ చేపట్టారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.