Peddapalli Women: పెద్దపల్లిలో యువకుడికి దేహశుద్ధి చేసిన మహిళలు, అసభ్య ప్రవర్తనకు కట్టేసి కొట్టారు..-peddapally women tied young man and beat him up for indecent behavior ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddapalli Women: పెద్దపల్లిలో యువకుడికి దేహశుద్ధి చేసిన మహిళలు, అసభ్య ప్రవర్తనకు కట్టేసి కొట్టారు..

Peddapalli Women: పెద్దపల్లిలో యువకుడికి దేహశుద్ధి చేసిన మహిళలు, అసభ్య ప్రవర్తనకు కట్టేసి కొట్టారు..

HT Telugu Desk HT Telugu
Aug 08, 2024 08:22 AM IST

Peddapalli Women: అసభ్య ప్రవర్తనతో మహిళలను సతాయించిన యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన పెద్దపల్లిలో జరిగింది.

అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడికి దేహశుద్ధి చేస్తున్నమహిళలు
అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడికి దేహశుద్ధి చేస్తున్నమహిళలు

Peddapalli Women: అమ్మాయిలు కనిపిస్తే అసభ్యకరంగా ప్రవర్తించాడు. బట్టలు విప్పి బహిరంగంగా రోడ్డుపై తిరిగాడు.‌ విసిగిపోయిన కాలనీవాసులు, మహిళలు సంస్కారహీనంగా ప్రవర్తించే యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. మరోసారి మహిళల వైపు చూడకుండా చెప్పులతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. పెద్దపల్లి సమీపంలోని అందుగులపల్లికి చెందిన యువకుడు పందిళ్ళ రంజిత్ స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ కి డుమ్మా కొట్టి క్రిస్టియన్ కాలనీలో ప్యాంటు విప్పేసి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ప్రతిరోజు మహిళలు, విద్యార్థులు వెళ్ళే సమయంలో వారి వెంట పడి అసభ్య ప్రవర్తనతో ఇబ్బందులకు గురి చేశాడు. మతిస్థిమితం సరిగా లేని పిచ్చోడు కావచ్చని మొదట స్థానికులు భావించారు. రోజురోజుకు అతని వికృత చేష్టలు మితిమీరిపోవడంతో విసిగిపోయిన స్థానికులు, మహిళలు అతని ఆట కట్టించారు.

అంతా కలిసి పట్టుకుని చెట్టుకు కట్టేశారు. చెప్పులతో చితక్కొట్టారు. తప్పయింది, ఇంకోసారి అలా ప్రవర్తించనని బ్రతిమాలిన వదలకుండా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

మహిళల వైపు చూడకుండా పోలీసుల మర్యాద…

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన చావు దెబ్బలు తిన్న రంజిత్ కు పోలీసులు సైతం తమదైన శైలిలో సత్కరించారు. మరోసారి మహిళల వైపు కన్నెత్తి చూడకుండా తగిన బుద్ధి చెప్పి ఠాణాకు తరలించారు.‌ మహిళలు చిడాయించినా, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులకు సమాచారం ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాలేజీ కి వెళ్ళకుండా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు పేరెంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.

చట్ట పరిధిలో శిక్షించాలి...చెట్టుకు కట్టేసి కొట్టడం ఏంటీ?

యువకుడు చేసింది తప్పే కావచ్చు.. కానీ చట్టపరిదిలో శిక్షించకుండా చెట్టు కట్టేసి చితక్కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు కొందరు.‌ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైన పద్దతి కాదంటున్నారు. మరి కొందరు మాత్రం సమర్థిస్తు అలాంటి వారికి అలా గుణపాఠం చెబుతేనే గడుగ్గాయిలకు బుద్ధి వస్తుందంటున్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)