Peddaplli News : పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన గురుకుల హాస్టల్ విద్యార్థులు, అధికారుల్లో కదలిక!-peddapalli kataram gurukula hostel students protest for basic amenities ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddaplli News : పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన గురుకుల హాస్టల్ విద్యార్థులు, అధికారుల్లో కదలిక!

Peddaplli News : పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన గురుకుల హాస్టల్ విద్యార్థులు, అధికారుల్లో కదలిక!

HT Telugu Desk HT Telugu
Apr 08, 2024 10:01 PM IST

Peddaplli News : పెద్దపల్లి జిల్లాలో గురుకుల హాస్టల్ విద్యార్థులు మండుటెండలో రోడ్డుపై ఆందోళనకు దిగారు. హాస్టల్ ఆధ్వానంగా ఉందని, కూలిపోయే స్థితి ఉందని నిరసన తెలిపారు. దీంతో అధికారులు దిగివచ్చారు.

రోడ్డెక్కిన గురుకుల హాస్టల్ విద్యార్థులు
రోడ్డెక్కిన గురుకుల హాస్టల్ విద్యార్థులు

Peddaplli News : పెద్దపల్లి జిల్లాలో హాస్టల్ విద్యార్థులు(School Students Protest) రోడ్డెక్కారు. ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించి మార్పు రావాలి.. హాస్టల్ మారాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రాతినిధ్యం వహించే మంథని నియోజకవర్గంలోని కాటారం వెంకటాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల హాస్టల్ సమస్యలతో విద్యార్థులు బడి బంద్ చేసి ఆరెంద ఎక్స్ రోడ్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. హాస్టల్ (Boys Hostle)లో కనీస సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిపోయే స్థితిలో బిల్డింగ్.. షాక్ కొట్టేలా కరెంట్ స్విచ్ బోర్డులు..నీళ్లు రాని నల్లాలు..డోర్ లేని బాత్ రూమ్ లు.. దుర్గంధం వెదజల్లేలా హాస్టల్ పరిసరాలు ఉన్నాయని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్ల కొరతతో సిలబస్ కూడా పూర్తి కాలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చదువుకుంటామని ప్రశ్నించారు. పాఠశాల పీఈటీ బూతు పురాణం భరించలేక పోతున్నామని తెలిపారు. అరగంటసేపు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో వెంటనే మంథని ఎస్ఐ వెంకటకృష్ణ అక్కడికి చేరుకొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిచ్చారు.

మూడు కిలోమీటర్లు నడిచి ధర్నా చేసిన విద్యార్థులు

హఠాత్తుగా విద్యార్థులు రోడ్డెక్కడంతో(Gurukula Students Protest) అందరిని ఆందోళనకు గురి చేసింది. వెంకటాపూర్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు కాలినడకన విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆరెందో క్రాస్ రోడ్డు వరకు మంథని-కాటారం ప్రధాన రహదారి పైకి చేరి నిరసన తెలుపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరి సపోర్టు లేకుండా విద్యార్థులు మార్పు రావాలి.. హాస్టల్ మార్చాలనే నినాదంతో ఆందోళనకు దిగడం అధికారుల్లో చలనం తీసుకొచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యాశాఖ, గురుకుల పాఠశాలల (Gurukula Schools)అధికారులు వెంటనే మేల్కొని హాస్టల్ బాట పెట్టారు. విద్యార్థులు రోడ్డెక్కడంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

విద్యార్థుల ఆందోళనతో కదిలిన అధికారులు

సమస్యలతో సతమతమవుతూ చదువుకోలేని పరిస్థితులో విద్యార్థులు(Students) రోడ్డెక్కడంతో అధికారులు స్పందించారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ గౌతంరెడ్డి పాఠశాలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. అద్వానంగా ఉన్న హాస్టల్(Hostel) దుస్థితిని చూసి విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలపై విద్యార్థులు ఏకరువు పెట్టడంతో సమస్యలన్నింటిని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోగా సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. బూతులు తిట్టే పీఈటీపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రిన్సిపల్ నాగలత ఫిర్యాదుతో చర్యలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు ఆవేదనతో ఆందోళనకు దిగే వరకు అధికారులు స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

HT Correspondent K.V.REDDY, Karimnagar

Whats_app_banner