BRS Janagama Ticket : పల్లాకే 'జనగామ' టికెట్...? సయోధ్య కుదిరినట్టేనా..!-palla rajeshwar reddy will be finalized as janagama brs candidate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Janagama Ticket : పల్లాకే 'జనగామ' టికెట్...? సయోధ్య కుదిరినట్టేనా..!

BRS Janagama Ticket : పల్లాకే 'జనగామ' టికెట్...? సయోధ్య కుదిరినట్టేనా..!

Mahendra Maheshwaram HT Telugu
Sep 24, 2023 05:45 AM IST

TS Assembly Elections : వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. అయితే మిగిలిన 4 సీట్లపై కసరత్తు చేస్తోంది. ఇందులో జనగామ టికెట్ కీలకంగా ఉంది. నియోజకవర్గ నేతలతో మంతనాలు జరుపుతున్న బీఆర్ఎస్ హైకమాండ్... సీటు కేటాయింపుపై క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది.

జనగామ టికెట్ ఖరారు..?
జనగామ టికెట్ ఖరారు..?

Jangaon Assembly Constituency 2023 : అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ లోని అంతర్గత కలహాలు తెరపైకి వస్తున్నాయి. అధినాయకత్వం సూచనలతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ... ఎన్నికలకు మరికొద్దిరోజులే టైం ఉండటంతో.... టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గట్టిగా హామీనైనా లభించేలా పావులు కదుపుతున్నారు. లాభం లేదనుకుంటే గుడ్ బై చెప్పి... పక్క పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్ దక్కించుకున్న మైనంపల్లి పార్టీకి రాజీనామా చేయటంతో... మొత్తం ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది బీఆర్ఎస్. ఇందులో జనగామ సీటు అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ... మరో ఎమ్మెల్సీ గట్టిగా ప్రయత్నాలు చేయటంతో అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు కేసీఆర్. అయితే ఇక టికెట్ పై క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్న హైకమాండ్... ఆ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉన్నట్లు కనిపిస్తోంది.

పల్లాకే టికెట్...?

జనగామ విషయంలో నిర్ణయం తీసుకోవాలని భావించిన గులాబీ పార్టీ హైకమాండ్... పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపే మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇవాళో, రేపో అధికారికంగా ప్రకటన రావొచ్చని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. అయితే ముత్తిరెడ్డి ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని సమాచారం. ఇప్పటికే ఆయనతో కూడా పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఘన్ పూర్ మాదిరిగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే దిశగా పెద్దలు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ముత్తిరెడ్డి కూడా రాజయ్య మాదిరిగా ఓకే అంటే… జనగామ పంచాయితీకి కూడా పుల్ స్టాప్ పడినట్లు అవుతుంది.

ఇదిలా ఉంటే తనకే టికెట్ దక్కుతుందనే విషయాన్ని పల్లా పరోక్షంగా చెబుతూ శనివారం పలు వ్యాఖ్యలు చేశారు. ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దామని తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఇందులో పల్లా మాట్లాడుతూ... జనగామలోనూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పదేళ్లుగా బాగా పని చేశారన్నారు. కొన్ని ఇబ్బందులవల్ల జనగామలో మనం(BRS) ఓడిపోయే అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి అంటే గౌరవం ఉందని... ముత్తిరెడ్డిని పిలిపించి మాట్లాడుతారని, అందరం ఏకతాటిపై వెళ్దామని జనగామ జిల్లా నేతలతో చెప్పారు. ముత్తిరెడ్డ ఆశీర్వాదం కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ టిక్కెట్ ప్రకటించాక అందరం కలిసి జనగామకు వెళ్దామన్నారు. పల్లా చేసిన ఈ వ్యాఖ్యలతో జనగామ టికెట్ దాదాపు ఆయనకు ఖరారైనట్లు తెలుస్తోంది.

జనగామ గతంలో ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి పలుమార్లు వార్తల్లో నిలిచారు. భూకబ్జా ఆరోపణల విషయం పెద్ద వివాదంగా మారింది. ఓ దశలో జిల్లా కలెక్టరే ఆయనకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించిన పరిస్థితులు కనిపించాయి. ఇదిలా ఉండగానే... కొంతకాలంగా మరోవైపు ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి తీవ్రస్థాయిలో పోరాటం చేస్తుంది. స్వయంగా తన తండ్రి కబ్జా కోరు అంటూ బాహటంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కబ్జా చేసిన భూమిని తిరిగి అప్పగిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోనే కాకుండా... రాష్ట్రవ్యాప్తంగా కూడా ముత్తిరెడ్డి వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ కూడా ముత్తిరెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయన టికెట్ కూడా పెండింగ్ లో పెట్టాల్సి వచ్చింది. ఇక ఇదే సీటుపై గురిపెట్టారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ దిశగా పక్కగా అడుగులు వేస్తూ వచ్చారు. పల్లాకే టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల కిందట నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు... స్వయంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇదంతా కూడా పల్లా డైరెక్షన్ లో జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తే… పల్లా పేరు ఇవాళో, రేపో ప్రకటించే ఛాన్స్ ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం