Narsapur BRS Seat : మదన్ రెడ్డి వర్సెస్ సునీతా లక్ష్మారెడ్డి, మరో రెండ్రోజుల్లో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన?
Narsapur BRS Seat : నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై మరో రెండు, మూడు రోజుల్లో అధిష్టానం ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి , సునీతా లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు.
Narsapur BRS Seat : మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులతో మాట్లాడుతూ పార్టీని ఒక్కతాటి పైకి తీసుకొస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిని కూడా రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని అని పార్టీ నాయకులూ అంటున్నారు. దీనికి ముందుగానే ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డిని, టికెట్ కోసం పోటీ పడుతున్న మాజీ మంత్రి వాకిటి సునీత లక్ష్మారెడ్డిని పిలిచి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. వాళ్లద్దరినీ పిలిసి మాట్లాడి నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపైన నిలిపి అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు అంటున్నారు. అక్టోబర్ రెండో వారంలోపు తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతుండడంతో బీఆర్ఎస్ అధిష్టానం నర్సాపూర్ అభ్యర్థి ఎవరో అనేది ఈ వారంలోపే తేల్చాలని కృతనిశ్చయంతో ఉందని సమాచారం.
పోటీలో సునీతా లక్ష్మారెడ్డి
115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్... నర్సాపూర్, జనగాం, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి 74 సంవత్సరాలు ఉండటంతో అభ్యర్థిని మార్చాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేసింది. మదన్ రెడ్డికి నర్సాపూర్ పార్టీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ క్రమంలో మదన్ రెడ్డి తన ఫాలోవర్స్ తో కలిసి హరీశ్ రావు ఇంటి ముందు ధర్నా చెయ్యడం, ముఖ్యమంత్రిని, కేటీఆర్ కలిసి మళ్లీ తన పేరు ప్రకటించాలని అభ్యర్థించడం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఎన్నికల్లో పోటీచేస్తానని వెనుకకు తగ్గేది లేదని మదన్ రెడ్డి ప్రకటించారు. సునీత లక్ష్మారెడ్డి కూడా ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ కలిశారు. ఒక బడా ఫార్మాసిటికల్ కంపెనీ యజమాని సునీత లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
మదన్ రెడ్డి వైపే మొగ్గు!
సర్వేల ఆధారంగా... పార్టీ నాయకుల ఒపీనియన్ తీసుకోవడంతో మదన్ రెడ్డికే నర్సాపూర్ లో గెలుపు అవకాశం ఉన్నట్టు తెలియడయంతో... మదన్ రెడ్డినే మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టనున్నట్టు ప్రచారం జరుగుతోది. అయినా పట్టువదలని సునీత లక్ష్మారెడ్డి తనకు టికెట్ ఇస్తానంటేనే 2016లో పార్టీలో చేరానని తనకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నాయకులను, పార్టీ నాయకత్వం పిలిచి సర్దిచెప్పి వారి ఇద్దరిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించనున్నారు. వారిద్దరిలో ఎవరు కూడా మరొక పార్టీకి వెళ్లకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా నచ్చజెప్పాలని అధిష్టానం చూస్తుంది.