Paleru Farmer Selfie Video : భూ కబ్జాదారుని ఆగడం, ఖమ్మంలో రైతు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం
Paleru Farmer Selfie Video : తన భూమిని మాజీ మావోయిస్టు కబ్జా చేయడంతో తట్టుకోలేకపోయిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Paleru Farmer Selfie Video : సొంత భూమి కళ్లెదుటే కబ్జాకు గురవుతుంటే రైతు గుండె చెదురుతోంది. అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోని పరిస్థితితో చివరికి బలవంతపు మరణానికి సిద్ధమవుతున్నాడు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాఖాలో సన్నా, చిన్న కారు రైతు ఏలేటి వెంకటరెడ్డి(45) పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాజీ మావోయిస్టుగా చెప్పుకునే జాటోత్ వీరన్న అనే వ్యక్తి ఆగడాలకు వెంకటరెడ్డి పొలం వద్దనే పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.పోలీసుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం, జాన్ పహాడ్ తండాకు చెందిన ఏలేటి వెంకట్ రెడ్డి తనకున్న మూడెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి తనకున్న భూమిని జాటోత్ వీరన్నకి విక్రయించాడు. వాయిదాల పద్దతిలో డబ్బులు చెల్లిస్తూ భూమిని వశం చేసుకున్నాడు. కాగా ఆ భూమి సాగుకు అనుకూలంగా లేదని, పక్కనే ఉన్న వెంకట్ రెడ్డి భూమిని కబ్జా చేసి హద్దులు మార్చి ఈ భూమినే కొనుగోలు చేసినన్నట్లుగా భయబ్రాంతులకు గురి చేయడం మొదలు పెట్టాడు. దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్న నేపద్యంలో వెంకట రెడ్డి ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో వీరన్న అతని తమ్ముడు ఉపేందర్, అల్లుడు జర్పల సురేష్, భార్య చిన్నిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
నాడు తమ్ముడు.. నేడు అన్న..
2021లో ఇదే భూ వివాదంలో వీరన్న ఆగడాలకు వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా వీరన్నపై కేసు నమోదైంది. ఇప్పటికే వీరన్నపై పది కేసులపైగా నమోదయ్యాయి. తమ్ముడు భూమిని కొనుగోలు చేసి అన్న భూమి కబ్జాకు పాల్పడుతూ ట్రాక్టర్ సహాయంతో దౌర్జన్యంగా వరి సాగు చేస్తుండగా రైతు వెంకట్ రెడ్డి ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పలు దఫాలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగగా పోలీసులు కేసు నమోదు చేసి కేసును నిర్లక్ష్యంగా నీరుగార్చారు. దీంతో మనస్థాపానికి గురైన రైతు వెంకటరెడ్డి ఆదివారం తన పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే వీరన్న, అతని సోదరుడు ఉపేందర్ ట్రాక్టర్ తో పొలాన్ని దౌర్జన్యంగా దున్నుతున్న దృశ్యాన్ని చూసి తట్టుకోలేక ట్రాక్టర్ ను ఆపమని వేడుకున్న లెక్కచేయకుండా దున్నుతుండగా తీవ్ర మనస్థాపానికి గురై పొలం వద్దే ఉన్న పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీశాడు.
ఇది ఆలస్యంగా గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటరెడ్డిని హుటాహుటిన ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వెంకటరెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలిపారు. భార్య పిల్లలు రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పలు కేసుల్లో నిందుతుడిగా ఉన్న మాజీ నక్సలైట్ జాటోత్ వీరన్న పై చర్యలు తీసుకోకుండా ఖమ్మం రూరల్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తనకు న్యాయం జరగదేమోనని ఆందోళన చెంది రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంకట్ రెడ్డికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం