Hyderabad : డిటోనేటర్లతో భవనాన్ని పేల్చిన అధికారులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు-officials blasted illegal structures with detonators in kondapur of sangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : డిటోనేటర్లతో భవనాన్ని పేల్చిన అధికారులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Hyderabad : డిటోనేటర్లతో భవనాన్ని పేల్చిన అధికారులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Basani Shiva Kumar HT Telugu
Sep 26, 2024 01:03 PM IST

Hyderabad : హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కొండాపూర్‌లో చెరువులో నిర్మించిన భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చేశారు. జేసీబీలు వెళ్లే వీలు లేకపోవడంతో.. డిటోనేటర్లతో పేల్చేశారు. ఈ క్రమంలో శిథిలాలు మీదపడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

డిటోనేటర్లతో భవనాన్ని పేల్చిన అధికారులు
డిటోనేటర్లతో భవనాన్ని పేల్చిన అధికారులు

సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా చెరువులోనే భవనాన్ని నిర్మించారు. ఇది అక్రమ కట్టడం అని అధికారులు కూల్చివేయడానికి రెడీ అయ్యారు. అయితే.. ఆ భవనం దగ్గరకు జేసీబీలు, ప్రొక్లెయిన్‌లు వెళ్లే వీలు లేకుండా పోయింది. దీంతో అధికారులు కొత్త ఆలోచన చేశారు. డిటోనేటర్లతో భవనాన్ని పేల్చేశారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ నగర శివారు కొండాపూర్‌ మండలం కుతుబ్‌శాయి పేట్ గ్రామంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల ఓ భారీ అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. కొందరు వ్యక్తులు చెరువులోనే విలాసవంతంగా భవనం కట్టినట్టు గుర్తించారు. ఆ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయించారు. డిటోనేటర్లతో అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు.

ఈ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో డిటోనేటర్ల పేలి.. శిథిలాలు ఎగిరిపడ్డాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 12 సంవత్సరాల కిందట మల్కాపురం పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారని అధికారులు వెల్లడించారు. నీటిలో అడుగుపెట్టకుండా.. కొంత దూరం నుంచే మెట్లు కట్టారు. సదరు బిల్డింగ్ యజమాని ఫ్యామిలీ వీకెండ్‌లో వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని స్థానికులు చెబుతున్నారు.

అటు పలు ప్రాంతాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా చెరువులు ఆక్రమించి నిర్మించిన భవనాలపై నజర్ పెట్టింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు పరిశీలించి.. చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయిస్తూ.. రేవంత్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లను డిప్యూటేషన్‌పై హైడ్రా కోసం ఇకనుంచి పని చేయనున్నారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారకి భయం మరింత పెరిగింది.

తాజాగా హైడ్రా కూల్చివేతలపై మాజీమంత్రి మల్లారెడ్డి స్పందించారు. హైడ్రా వల్ల ప్రశాంతత లేదు.. నిద్ర లేదని అని అన్నారు. హైడ్రా అధికారుల నుంచి తన కాలేజీలకు నోటీసులు వచ్చాయని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందోనని ఆందోళన చెందాల్సి వస్తోందన్నారు. తనకు ఉన్న విద్యా సంస్థలు మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నిర్మించానని స్పష్టం చేశారు. అప్పుడు కట్టిన కాలేజీలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

Whats_app_banner